తీవ్ర విషాదం : క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌ని ఇంటికి తీసుకెళ్లిన డెలివరీ బాయ్- కేక్ తిని 5ఏళ్ల కుమారుడు మృతి!
08 October 2024, 12:00 IST
- Bengaluru cake incident : బెంగళూరులో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది. క్యాన్సిల్ చేసిన కేక్ ఆర్డర్‌ని ఓ డెలివరీ బాయ్, తన ఇంటి తీసుకెళ్లాడు. ఆ కేక్ తిన్న అతని కుమారుడు చనిపోయాడు. డెలివరీ బాయ్, అతని భార్య ఆరోగ్యం విషమంగా ఉంది.
బెంగళూరులో కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి!
కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి.. కస్టమర్ క్యాన్సిల్ చేసిన కేక్ ఆర్డర్‌ని ఇంటికి తీసుకెళ్లాడు. అది తిన్న తర్వాత, అతని 5ఏళ్ల కుమారుడు మరణించాడు.
ఇదీ జరిగింది..
బెంగళూరులోని భువనేశ్వరి నగర్లో సోమవారం జరిగింది ఈ ఘటన. కేక్ తిన్న ఐదేళ్ల బాలుడు దుర్మరణం చెందగా, డెలివరీ బాయ్- అతని భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉంది.
“ఇంట్లో కేక్ తిన్న కొద్దిసేపటికే ధీరజ్ అనే బాలుడు, అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చివరికి బాలుడు మృతి చెందాడు,” అని మీడియా కథనాలు పేర్కొన్నారు.
బాలుడి తండ్రి బాలరాజ్ స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ ఓ కస్టమర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయడంతో కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు కేక్ షేర్ చేసుకుని తిన్న కొద్దిసేపటికే ముగ్గురూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ధీరజ్ ప్రాణాలతో బయటపడలేకపోగా బాలరాజ్- ఆయన భార్య నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో కిమ్స్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి కుటుంబం ఆకస్మిక అనారోగ్యానికి దారితీసిన కారణాలపై మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.
ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫుడ్ పాయిజనింగ్ కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యాయత్మంలో భాగంగానే అందరు కలిసి కేక్ తిన్నారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్ విశ్లేషణ, తదుపరి వైద్య నివేదికల కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపింది.
దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
కర్ణాటక కేక్స్‌లో క్యాన్సర్ కారక పదార్థాలు..!
బెంగళూరులోని పలు బేకరీల కేక్‌లపై నిర్వహించిన పరీక్షల్లో 12 రకాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలినట్టు ప్రభుత్వం ఇటీవలే చెప్పడం సర్వత్రా భయాందోళనకు దారితీసింది. కేకుల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వాటిలో ఉపయోగించే రంగుల గురించి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా వీటి ద్వారా ముప్పు ఉందని ప్రకటించింది.
కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ బేకరీలను ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని చెబుతోంది. ఈ కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.