AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో విజయవంతంగా మూడు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు, 20లక్షలకు చేరువలో ఓపీ సేవలు
AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్ దశలవారీగా అన్ని హంగులను సమకూర్చుకుంటోంది. తాజాగా మూడు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను ఎయిమ్స్ వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.
AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. అత్యవసర దశలో ఉన్న ముగ్గురు బాధితులకు వారి రక్త సంబంధీకుల నుంచి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో మూడు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిరవ్హించారు. గత ఆగస్టులో మొదటి కిడ్నీ మార్పిడి చికిత్సను పూర్తి చేశారు. నెలరోజుల్లోనే మరో రెండు శస్త్ర చికిత్సలను ఎయిమ్స్ వైద్య బృందాలు పూర్తి చేశాయి.
మొదటి కిడ్నీ మార్పిడిని 2024 ఆగస్టు 30న విజయవాడకు చెందిన 29 ఏళ్ల మద్దెల శ్రీరామ్‌కు నిర్వహించారు. వృత్తి రీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న శ్రీరామ్ అతని తన తల్లి 42ఏళ్ల మద్దెల శ్యామలా దేవి నుండి ఒక కిడ్నీని పొందాడు. ఎయిమ్స్‌లో ఉన్న నిపుణులైన సర్జన్‌లు, యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, సహాయక బృందంతో పాటు AIIMS న్యూ ఢిల్లీ నుండి నిపుణులైన సర్జన్లు డాక్టర్.వి.శీను, డాక్టర్.ఎ.కృష్ణలు కిడ్నీ మార్పిడి కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించారు. మొదటి చికిత్స విజయవంతం కావడంతో అవయవ గ్రహీతతో పాటు దాత కూడా పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు.
సెప్టెంబర్‌లో రెండు ఆపరేషన్లు…
సెప్టెంబరులొ ఎయిమ్స్ వైద్యుల బృందంమరో రెండు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించింది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు సమీపంలోని గ్రామానికి చెందిన కళ్యాణం గౌరీ ప్రసాద్ అనే ప్రైవేట్ ఉద్యోగి, అతని తల్లి 47ఏళ్ల కె. దుర్గమ్మ నుండి కిడ్నీని పొందారు. మరో కేసులో త్రాసుల సాయి సూర్య ప్రకాష్ అనే 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. అతని తల్లి 51ఏళ్ల గోవర్ధని నుండి కిడ్నీ పొందాడు. ఎయిమ్స్ వైద్యులు సాధించిన ఈ విజయాలు ఈ ప్రాంత ప్రజలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో కీలక మైలు రాయిని అధిగమించినట్టు రుజువు చేశాయి.
సంక్లిష్ట వ్యాధుల చికిత్స & సంక్లిష్ట శస్త్రచికిత్సలు
కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలతో పాటు AIIMS మంగళగిరిలొ వివిధ సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందుతోంది. సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ మొదలైన విభాగాల ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ శస్త్ర చికిత్సలను వేర్వేరు విభాగాలకు చెందిన బృందాలు సమన్వయంతో నిర్వహించాయి. క్లిష్టమైన వైద్య మరియు శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించడంలో ఎయిమ్స్ ఇన్‌స్టిట్యూట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. వివిధ క్లిష్టమైన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సేవలు మరియు యాంజియోగ్రామ్ సేవలు కూడా ఇటీవలే ప్రారంభించారు.
ఎయిమ్స్ మంగళగిరిలో ప్రస్తుతం కేవలం రక్తసంబంధీకుల నుంచి స్వీకరించే కిడ్నీ మార్పిడి చికిత్సలను మాత్రమే అనుమతిస్తున్నారు. అవయవదానానికి సంబంధించిన చికిత్సలు భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రుల్లో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎయిమ్స్‌లో అతి తక్కువ ఖర్చుతో ఈ చికిత్సలు అందిస్తున్నారు. కిడ్నీ మార్చాల్సిన బాధితులకు డయాలసిస్ సేవలు అందిస్తూ శస్త్ర చికిత్సలకు సిద్ధం చేస్తున్నట్టు వైద్యులు వివరించారు.
AIIMS మంగళగిరి గురించి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన హామీల్లో భాగంగా మంగళగిరిలో ఎయిమ్స్ 2015లో శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఫిబ్రవరి, 2024న AIIMS మంగళగిరిని జాతికి అంకితం చేశారు. 2019 నుంచి ఎయిమ్స్‌లో ఓపీ సేవలు మొదలయ్యాయి. మొదట్లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఎయిమ్స్ కార్యకలాపాలు సాగేవి.
మంగళగిరిలో ఔట్ పేషెంట్ విభాగం 12 మార్చి 2019 న ప్రారంభించారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలోనే ఎయిమ్స్ దినదినాభివృద్ధి చెందింది. ఇన్‌పేషెంట్, ఐసియు సేవలు, ల్యాబ్ & డయాగ్నొస్టిక్ సేవలు, OT సేవలు, ట్రామా & అత్యవసర సేవలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులొకి వచ్చాయి.
ఐదేళ్లలో సాధించిన పురోగతి…
1. ఓపీలలో సేవలు పొందిన రోగులు 19,32,329
2. ఇన్ పేషెంట్ అడ్మిషన్స్ 33,495
3. అత్యవసర అడ్మిషన్స్ 24,682
4. శస్త్రచికిత్సలు 11,197
5. చిన్న శస్త్రచికిత్సలు 27,715
6. ప్రసవాలు 964
7. డయాలసిస్ 5,172
8. ప్రయోగశాల మరియు రేడియోలాజికల్ పరీక్షలు 30,25,509