తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Waqf Bill 2024: వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంటే ఏమిటి? ఇందులో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ఏంటి?

Waqf Bill 2024: వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంటే ఏమిటి? ఇందులో ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు ఏంటి?

HT Telugu Desk HT Telugu

08 August 2024, 15:10 IST

google News
    • వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్ష ఇండియా కూటమి ఈ బిల్లును మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా పేర్కొంటూ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రం వివరిస్తోంది.
వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంటే ఏమిటి? దీనిని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంటే ఏమిటి? దీనిని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? (PTI)

వక్ఫ్ సవరణ బిల్లు 2024 అంటే ఏమిటి? దీనిని విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?

Waqf Bill 2024 Explained: 1995 వక్ఫ్ బోర్డుల చట్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ రాజకీయ దుమారం రేపుతోంది. భారత రాజ్యాంగంలోని 26వ అధికరణం కల్పించిన ముస్లిం సమాజం భూమి, ఆస్తులు మరియు "మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛను" హరించడమే ఈ ప్రతిపాదనల లక్ష్యమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వక్ఫ్ బోర్డులను నియంత్రించాలన్న డిమాండ్ ముస్లిం సమాజం నుంచే వచ్చిందని అధికార ఎన్డీఏ వాదిస్తోంది. వక్ఫ్ ఆస్తి అంటే ఏమిటి? ప్రతిపాదిత సవరణలు ఏమిటి అనే దానిపై సంక్షిప్త వివరణ ఇక్కడ ఉంది.

వక్ఫ్ ప్రాపర్టీ అంటే ఏమిటి?

ముస్లింలు తమ దేవుని పేరుపై ధార్మిక ప్రయోజనాల కోసం అంకితం చేసిన చరాస్తులు, లేదా స్థిరాస్తులను వక్ఫ్ ఆస్తులు అంటారు. డాక్యుమెంటేషన్ ప్రారంభం కాకముందు నుంచే ఈ విధానం ఉనికిలో ఉంది. అందువల్ల చాలాకాలంగా వక్ఫ్ ప్రయోజనాల కోసం వాడుకలో ఉన్న ఆస్తులను కూడా వక్ఫ్ ప్రాపర్టీలుగా పరిగణిస్తారు. వక్ఫ్ ఆస్తి ధార్మిక ప్రయోజనాల కోసం ఉండవచ్చు లేదా ఒక వ్యక్తి వారసులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రైవేట్ గా కూడా ఉండవచ్చు. వక్ఫ్ ఆస్తిని ట్రాన్స్ ఫర్ చేయడం కుదరదు. ఇది దేవుని పేరు మీద శాశ్వతంగా ఉంటుంది. వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయం సాధారణంగా విద్యా సంస్థలు, శ్మశానవాటికలు, మసీదులు, షెల్టర్ హోమ్ ల నిర్వహణకు ఉపయోగిస్తారు. ఇది పెద్ద సంఖ్యలో ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుంది.

వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి?

వక్ఫ్ బోర్డు అనేది వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు నామినేటెడ్ సభ్యులతో కూడిన చట్టబద్ధమైన సంస్థ. బోర్డు ప్రతి ఆస్తికి ఒక కస్టోడియన్ ను నియమిస్తుంది. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్దేశిత ప్రయోజనాలకు ఉపయోగించేలా చూసుకుంటుంది. 1964 లో స్థాపించబడిన సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యుసి) భారతదేశం అంతటా రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులను పర్యవేక్షిస్తుంది. సలహాలు, సూచనలు అందిస్తుంది. అలాగే, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, వక్ఫ్ బోర్డులకు ఆస్తుల నిర్వహణపై సలహాలు ఇస్తుంది. రాష్ట్ర స్థాయి బోర్డులు తమ పనితీరు, ముఖ్యంగా ఆర్థిక పనితీరు, సర్వే, రెవెన్యూ రికార్డులు, వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ, వార్షిక, ఆడిట్ నివేదికలు మొదలైన వాటిపై సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కు సమాచారం అందించాలని వక్ఫ్ చట్టం 1954లోని సెక్షన్ 9(4) ఆదేశించింది.

1995లో కొత్త చట్టం

వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించి 1995లో కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. తరువాత, ఈ చట్టాన్ని 2013 లో సవరించారు. ఈ చట్టం ప్రకారం.. ఒక ఆస్తిని 'వక్ఫ్ ప్రాపర్టీ'గా గుర్తించే అధికారాన్ని వక్ఫ్ బోర్డుకు కల్పించారు. ఒక ఆస్తిని వక్ఫ్ గా పరిగణించవచ్చా అనే వివాదం తలెత్తినప్పుడు, 1995 చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం అటువంటి విషయంలో ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది.

వక్ఫ్ బిల్లు, 2024 లో సవరణలు ఏమిటి?

ప్రభుత్వం ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లులో పలు కీలక సవరణలను ప్రతిపాదించింది. క్లుప్తంగా చెప్పాలంటే వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేయడం, మరింత ప్రభుత్వ నియంత్రణకు వీలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. ఏదైనా వక్ఫ్ ఆస్తికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలని, తద్వారా ఆస్తిని మదింపు చేయవచ్చని బిల్లులో ప్రతిపాదించారు. ఈ చట్టం అమల్లోకి రాకముందు లేదా తర్వాత వక్ఫ్ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని పేర్కొంది. ఒక ప్రాపర్టీ వక్ఫ్ ఆస్తినా?, లేక ప్రభుత్వ భూమినా? అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారని, ఆయన నిర్ణయమే అంతిమమని బిల్లులో ప్రతిపాదించారు. కలెక్టర్ నిర్ణయం తీసుకున్న తర్వాత రెవెన్యూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించవచ్చు. కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే వరకు ఆ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదని బిల్లులో పేర్కొన్నారు.

న్యాయ వివాదాలపై కోర్టుకు వెళ్లవచ్చు

వక్ఫ్ బోర్డు నిర్ణయంతో వివాదం తలెత్తితే ఇకపై సంబంధిత హైకోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఒక ఆస్తిని వక్ఫ్ గా పరిగణించడానికి పెద్దగా నిబంధనలు లేవు. ఆ ప్రాపర్టీ అసలు డిక్లరేషన్ అనుమానాస్పదంగా లేదా వివాదాస్పదంగా ఉన్నప్పటికీ. ఇస్లామిక్ చట్టం ప్రకారం, డాక్యుమెంటేషన్ (వక్ఫ్ నామా) ప్రామాణికంగా మారే వరకు, ఒక ఆస్తిని వక్ఫ్ గా నిర్ధారించవచ్చు. ఈ బిల్లు అటువంటి నిబంధనలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల చెల్లుబాటు అయ్యే వక్ఫ్ నామా లేనప్పుడు వక్ఫ్ ఆస్తిని అనుమానాస్పద లేదా వివాదాస్పద ఆస్తిగా పరిగణించవచ్చు. జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకునే వరకు ఈ ఆస్తిని ఉపయోగించడానికి వీల్లేదు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) నియమించిన ఆడిటర్ లేదా ఆ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏ అధికారి అయినా ఏ సమయంలోనైనా వక్ఫ్ ఆడిట్ ను పరిశీలించే అధికారాలు ఉంటాయని ప్రతిపాదిత బిల్లులో పేర్కొన్నారు. అలాగే, కేంద్ర వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా చూడాలని బిల్లులో ప్రతిపాదించారు.

తదుపరి వ్యాసం