Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్-waqf bill tabled congress alleges direct attack on freedom of religion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Waqf Bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్

Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్

HT Telugu Desk HT Telugu
Aug 08, 2024 02:19 PM IST

ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు పై గురువారం లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ బిల్లును కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్ష ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్రం చెబుతోంది.

వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్
వక్ఫ్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ; మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్న కాంగ్రెస్ (PTI file photo)

Waqf bill: భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గురువారం లోక్ సభలో వక్ఫ్ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రతిపక్షాలు, కేంద్రం మధ్య మాటల యుద్ధం మొదలైంది. వక్ఫ్ చట్టంలో ప్రతిపాదిత మార్పుల వెనుక ప్రేరణ విభజన రాజకీయాలకు పాల్పడటమేనని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించగా, బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత లలన్ సింగ్ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రభుత్వానికి మద్దతు పలికారు.

మత స్వేచ్ఛపై దాడి

ఈ బిల్లు (Waqf bill) సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అన్నారు. తాము హిందువులమని, అదే సమయంలో ఇతర మతాల విశ్వాసాలను గౌరవిస్తామని చెప్పారు. ‘‘మహారాష్ట్ర, హరియాణా ఎన్నికలకు ఈ బిల్లు ప్రత్యేకం. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో భారత ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని మీకు అర్థం కావడం లేదు. ఇది ఫెడరల్ వ్యవస్థపై దాడి’’ అని ఆయన లోక్ సభలో అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంపై ప్రభుత్వం చేస్తున్న దాడి అని ఆయన అన్నారు.

ముస్లిమేతరులు సభ్యులా?

‘‘ఈ బిల్లు ద్వారా ముస్లిమేతరులు కూడా వక్ఫ్ పాలక మండలిలో సభ్యులుగా ఉండాలనే నిబంధన పెడుతున్నారు. ఇది మత స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి... తర్వాత క్రిస్టియన్లు, ఆ తర్వాత జైనులు... ఇలాంటి విభజన రాజకీయాలను భారత ప్రజలు ఇప్పుడు సమర్ధించరు. ఈ విషయం అధికారంలో ఉన్న నేతలకు అర్థం కావడం లేదు’’ అని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి లలన్ సింగ్ అన్నారు. ఈ బిల్లు ద్వారా మసీదుల నిర్వహణలో జోక్యం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని స్పష్టం చేశారు.

పారదర్శకత కోసమే..

ఇది ముస్లింలకు వ్యతిరేకంగా రూపొందించిన బిల్లు కాదని లలన్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘ముస్లింలకు వ్యతిరేకంగా ఎలా ఉంటుంది? పారదర్శకత కోసం ఈ చట్టాన్ని రూపొందిస్తున్నాం. ప్రతిపక్షాలు ప్రధాన సమస్య నుండి పక్కదారి పడుతున్నారు. ఇందిరాగాంధీ హత్య సమయంలో వేలాది మంది సిక్కులను ఎలా చంపారో కేసీ వేణుగోపాల్ (కాంగ్రెస్) వివరించాలి’’ అని లలన్ సింగ్ డిమాండ్ చేశారు. వారు ఇప్పుడు మైనారిటీల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

వక్ఫ్ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలి

వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని లేదా స్టాండింగ్ కమిటీకి పంపాలని ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే డిమాండ్ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల అధికారాలు, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, సర్వే, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ బిల్లు దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది.

Whats_app_banner