Muslim Population: ‘రాష్ట్రంలో ముస్లిం జనాభా 40 శాతానికి పెరిగింది.. ఇది జీవన్మరణ సమస్య’: ముఖ్యమంత్రి ఆందోళన
Muslim Population: ముస్లిం జనాభా గణనీయంగా పెరగడంపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజకీయ సమస్య కాదని, జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు. తన రాష్ట్రంలో గత ఏడు దశాబ్దాల్లో ముస్లింల జనాభా 12 శాతం నుంచి 40 శాతానికి పెరిగిందని వ్యాఖ్యానించారు.
Muslim Population: అస్సాంలో ముస్లిం జనాభా గత ఏడు దశాబ్దాల్లో 40 శాతానికి పెరిగిందని, ఇది తమకు జీవన్మరణ సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. అసోం రాష్ట్రానికి చెందిన తనకు ముస్లిం జనాభా లో చోటు చేసుకున్న ఈ మార్పు పెద్ద జీవన్మరణ సమస్య అని వ్యాఖ్యానించారు. ‘‘1951లో అసోంలో 12 శాతంగా ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు 40 శాతానికి చేరింది. ఇది నాకు రాజకీయ సమస్య కాదు. ఇది నా లాంటి వారికి జీవన్మరణ సమస్య’’ అని ఆయన రాంచీలో విలేకరులతో అన్నారు.
జార్ఖండ్ లో జేఎంఎం ప్రభుత్వానిదే తప్పు
బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్ రాష్ట్రంలోకి అక్రమ వలసదారుల రాకను అరికట్టడంలో జార్ఖండ్ లో హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జేఎంఎం ప్రభుత్వం విఫలమైందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. జార్ఖండ్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ‘‘చొరబాటుదారులను వెనక్కు పంపే విషయంలో జార్ఖండ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చొరబాటుదారులను ఎందుకు వెనక్కు పంపించలేకపోతోందో జార్ఖండ్ లోని జేఎంఎం ప్రభుత్వం స్పష్టం చేయాలి. చొరబాటుదారులను వెనక్కు పంపించే పనిని నేను అస్సాంలో ప్రతిరోజూ చేస్తాను' అని శర్మ తెలిపారు.
కాంగ్రెస్ మండిపాటు..
శర్మ వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మండిపడ్డారు. ‘‘ అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితం అస్సాంలోని మైనారిటీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఆయన డ్యాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ కనిపించారు. బీజేపీకి ఓట్లు అవసరమైనప్పుడు అది ఆయనకు జీవన్మరణ సమస్యలా కనిపించదు’’ అని గౌరవ్ గొగోయ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల (lok sabha elections) సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అసోంలో చేసిన ప్రచారాన్ని ప్రస్తావిస్తూ గొగోయ్ ఎక్స్ లో పై విమర్శలు చేశారు. జార్ఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోనాల్ శాంతి కూడా శర్మ వ్యాఖ్యలను తప్పుబట్టారు. వరదల సమయంలో అసోం ప్రజలకు ఉపశమనం కలిగించడానికి బదులుగా, జార్ఖండ్ లో హింసను ప్రేరేపించడానికి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రయత్నిస్తున్నారని సోనాల్ శాంతి అన్నారు.