Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్; జైలు నుంచి విడుదల కానున్న జేఎంఎం నేత
Hemant Soren: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు బెయిల్ లభించింది. జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో ఉన్నారు.
Hemant Soren: భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆయనను నిర్దోషిగా భావించిందని ఆయన తరఫు న్యాయవాది అర్ణభ్ చౌదరి పేర్కొన్నారు. సోరెన్ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని హైకోర్టు జూన్ 13న రిజర్వ్ చేసింది. ‘‘సోరెన్ కు బెయిల్ మంజూరైంది. ప్రాథమికంగా అతను నేరానికి పాల్పడలేదని, బెయిల్ పై ఉన్నప్పుడు పిటిషనర్ నేరం చేసే అవకాశం లేదని కోర్టు అభిప్రాయపడింది’’ అని అర్ణబ్ చౌధరి తెలిపారు. హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రస్తుతం రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
జేఎంఎం శ్రేణుల ఆనందం
హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూర్ కావడంపై పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలను పంచుకున్నారు. సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్టు చేశారు. సోరెన్ ను అన్యాయంగా టార్గెట్ చేశారని, ఆయనపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసు అని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదించారు.
ఈడీ వాదనలు
జార్ఖండ్ రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న హేమంత్ సొరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అక్రమ భూదందాలో హేమంత్ సోరెన్ ప్రమేయాన్ని సాక్షులు ధృవీకరించారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. భూ యాజమాన్య వివరాలను మార్చడానికి అధికారిక రికార్డులను తారుమారు చేయాలని మాజీ సీఎం ఆదేశించారని సోరెన్ మీడియా కన్సల్టెంట్ అభిషేక్ ప్రసాద్ అంగీకరించారని ఈడీ వెల్లడించింది. జనవరి 31న హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడానికి ముందు ఈడీ పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది.
సొరేన్ తరఫున కపిల్ సిబల్
ఈడీ ఆరోపిస్తున్న భూ కబ్జా ఆరోపణలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కిందకు రావని హేమంత్ సొరేన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదించారు. ఒకవేళ, ఆ ఆరోపణలు నిజమైనా, అవి ఆస్తి హక్కుకు సంబంధించిన సివిల్ వివాదం అవుతుందే తప్ప క్రిమినల్ కేసు కాదని ఆయన వాదించారు. సోరెన్ ను జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగాయని కపిల్ సిబల్ ఆరోపించారు.
హేమంత్ సోరెన్ వారసుడు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడానికి ముందు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన విధేయుడు చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.