Jharkhand hill station: హిల్స్ స్టేషన్లు వేసవిలో కూడా చాలా చల్లగా ఉంటాయి. పచ్చని ప్రకృతి మధ్య ఉండే ఈ హిల్ స్టేషన్లకు వెళ్లేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. తక్కువ ఖర్చుతో అందమైన హిల్ స్టేషన్లను చూడాలనుకుంటే జార్ఖండ్ వెళ్ళండి. ఇక్కడ భిన్నమైన గిరిజన సంస్కృతి మిమ్మల్ని ఎంతో ఆకర్షిస్తుంది. జార్ఖండ్లోని హిల్ స్టేషన్లో సహజమైన సౌందర్యంతో మెరిసిపోతాయి. మరో ప్రపంచంలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. అందమైన తూర్పు కనుమల మధ్య ఉండే ఈ హిల్ స్టేషన్లో నగర జీవితానికి దూరంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి వెళ్లేందుకు సరైన ఎంపికగా ఝార్ఖండ్ హిల్ స్టేషన్లను చెప్పుకోవచ్చు.
జార్ఖండ్ వెళ్లేందుకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. కాబట్టి మీరు అనుకున్న బడ్జెట్లోనే వెళ్లి రావచ్చు. ఇక్కడ చూసేందుకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
సముద్రమట్టానికి 3700 అడుగుల ఎత్తులో ఉంటుంది నెటార్ హాట్ అనే హిల్ స్టేషన్. వృక్షాలతో నిండిపోయి ఉన్న ఈ హిల్ స్టేషన్ మీకు ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఎన్నో అందమైన జలపాతాలు ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఈ హిల్ స్టేషన్ చక్కటి ఎంపిక.
జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో ఉంటుంది. ఠాగూర్ హిల్ ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు మీద ఈ హిల్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇది సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యక్తులకు ఇది ఎంతో నచ్చే ప్రాంతం. ఎందుకంటే ఇది రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి దగ్గరలోనే ఉంటుంది.
మరొక అందమైన హిల్ స్టేషన్ లోహార్‌దగా. ఇక్కడ గిరిజనులు సంస్కృతి సంప్రదాయాలను గమనించవచ్చు. ఎన్నో గిరిజన గ్రామాల్లో తిరగవచ్చు. వారి జీవన విధానాన్ని గమనించవచ్చు. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకుంటే ఈ హిల్ స్టేషన్ కు రావాలి.
వెయ్యి ఉద్యానవనాలు కలిపితే ఎంత అందంగా ఉంటుందో హజారీబాగ్ కూడా అంతే అందంగా ఉంటుంది. ఈ అందమైన హిల్ స్టేషన్ పచ్చదనంతో నిండి ఉంటుంది. అందులోనూ సముద్రమట్టానికి 2,956 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. దీని చుట్టూ అడవులు, కొండలు, సరస్సులు నిండి ఉంటాయి. ఎన్నో వన్యప్రాణులు కూడా ఉంటాయి. ఎన్నో వృక్షాలకు, జంతువులకు ఇది నిలయం.
జైనుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పరస్‌నాథ్ కొండలు. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఎంతో మంది పర్యాటకులను ఆహ్వానిస్తుంది. ఇది సముద్రమట్టానికి 4,478 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే 20 మంది జైన తీర్థంకరులు మోక్షాన్ని పొందారని అంటారు. పురాతన జైన దేవాలయాలు ఇక్కడ ఉంటాయి. ప్రశాంతంగా మీకు కొన్ని రోజులు గడపాలనుకునే వారికి ఇది ఉత్తమ హిల్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు.