Rajya Sabha elections: పోటీ లేకుండానే 41 మంది ఏకగ్రీవం.. కపిల్ సిబల్ కూడా
రాజ్యసభకు 41 మంది పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూపీ నుంచి 11 మంది కాగా తమిళనాడు 6, బిహార్ 5, ఏపీ నుంచి నలుగురు ఉన్నారు. ఈ జాబితాలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు.
rajya sabha elections 2022: రాజ్యసభ స్థానాల్లో ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. మొత్తంగా 41మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్ నుంచి పి.చిదంబరం, రాజీవ్ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్ర వాల్మీకి, కవితా పాటిదార్, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్, ఆర్జేడీకి చెందిన మీసా భారతి, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్ చౌదరీ తదితరులు ఉన్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే...
అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్ నుంచి ఇద్దరు, పంజాబ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్ నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. 41 మందిలో 14 మంది బీజేపీ నుంచి ఏకగ్రీవం కాగా.. కాంగ్రెస్, వైసీపీ నుంచి నలుగురు, ముగ్గురు డీఎంకే,బీజేడీ నుంచి మరో ముగ్గురు ఉన్నారు.
ఏపీ, తెలంగాణలో ఏకగ్రీవం...
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలోని నాలుగు స్థానాలకు ఏకగ్రీవమయ్యాయి. ఇవన్నీ వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి. ఇక తెలంగాణలోని 2 స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. వీరికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు అధికారులు.
కపిల్ సిబల్ కూడా...
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన అభ్యర్థితత్వానికి సమాజ్ వాది పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏకగ్రీవం కాగా మిగిలిన 16 సీట్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ స్థానాలకు ఎన్నికల దృష్ట్యా పలు రాష్ట్రాల్లో క్యాంపు రాజకీయాల వేడి మొదలైంది.