AP Wakf Board Elections: హైకోర్టు ఆదేశాలతో వక్ఫ్‌ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదల-ap waqf board election schedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Wakf Board Elections: హైకోర్టు ఆదేశాలతో వక్ఫ్‌ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదల

AP Wakf Board Elections: హైకోర్టు ఆదేశాలతో వక్ఫ్‌ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదల

HT Telugu Desk HT Telugu
Sep 15, 2023 03:04 PM IST

AP Wakf Board Elections: ఏపీ స్టేట్ వక్ఫ్‌బోర్డు పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి నియామకాన్ని హైకోర్టు రద్దు చేసింది. పదవీ కాలం ముగిసిన తర్వాత గ్రామ పంచాయితీల తరహాలో వక్ఫ్‌బోర్డుకు ప్రత్యేక అధికారుల్ని నియమించే అవకాశం లేదని తేల్చడంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో వక్ఫ్‌బోర్డు ఎన్నికలకు ఏర్పాట్లు
ఏపీ హైకోర్టు ఆదేశాలతో వక్ఫ్‌బోర్డు ఎన్నికలకు ఏర్పాట్లు

AP Wakf Board Elections: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకానికి ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వక్ఫ్‌ బోర్డుకు ప్రత్యేక అధికారిని నియమించడాన్ని సవాలు చేస్తూ ముతావలీలు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ నియామకాన్ని కోర్టు రద్దు చేసింది. ప్రత్యేకాధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు చట్టబద్దత ఉండదని ప్రకటించింది. తక్షణం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించడంతో ఎన్నికల నిర్వహణకు మైనార్టీ సంక్షేమ శాఖ సిద్ధమైంది.

ఈ నెల 22 నుండి 25 వరకూ తేదీ వరకు వక్ఫ్‌ బోర్డు నామినేషన్ పత్రాల స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 25వతేదీన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నోటీసు అందించే గడువు ఈ నెల 26వ తేదీగా నిర్ణయించారు. వక్ఫ్ బోర్డు సభ్యుల ఎన్నికను ఈనెల 27వ తేదీన నిర్వహిస్తారు.

వక్ఫ్ చట్టం 1995 లోని సెక్షన్ 14 (1)(బి) లోని కేటగిరీ (ii) కి అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు రాష్ట్ర శాసన సభ శాసన మండలి లోని ముస్లిం సభ్యుల నుండి ఇద్దరు సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి మరియు డిప్యూటీ డైరెక్టర్ మైనారిటీ సంక్షేమ శాఖ షేక్ మస్తాన్ వలీ తెలిపారు.

నామినేషన్ పత్రాలను ఈనెల 22 నుండి 25వ తేదీ వరకూ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఎన్నికల అధికారి / డిప్యూటీ డైరెక్టర్, కమీషనర్ కార్యాలయం, మైనారిటీ సంక్షేమం, 4వ అంతస్తు, టి జి ప్లాజా, తాడేపల్లి, గుంటూరు జిల్లా చిరునామా నుండి పొందవచ్చునని పేర్కొన్నారు.

నామినేషన్ పత్రాలను నిర్ణీత తేదీల్లో అదే చిరునామాలో అందజేయవలెనని మస్తాన్ వలీ తెలిపారు. నామినేషన్ పత్రాల పరిశీలన ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుందన్నారు. అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసు అభ్యర్థి లేదా ప్రొపోజర్ తాడేపల్లిలోని మైనారిటీ సంక్షేమo కార్యాలయంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అందజేయాలని పేర్కొన్నారు.

ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య తాడేపల్లి లోని మైనారిటీ సంక్షేమం కమీషనర్ కార్యాలయంలో వక్ఫ్ బోర్డునకు ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. ఆసక్తి ఉన్న ముస్లిం అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించి ఎన్నికల్లో పాలు పంచుకోవచ్చునని తెలిపారు.

Whats_app_banner