Elon Musk: అమెరికా వీసా విధానంపై ఎలాన్ మస్క్ విమర్శలు; అంతా తలకిందులు సిస్టమ్ అని కామెంట్స్
01 November 2024, 15:17 IST
Elon Musk: అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అది తలకిందులు వ్యవస్థ అని విమర్శించరు. తాను గ్రీన్ కార్డు కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఒక భారతీయ ఏఐ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన ఒక పోస్టుపై ఎలన్ మస్క్ స్పందించారు.
యూఎస్ గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై ఎలాన్ మస్క్ విమర్శలు
Elon Musk: అమెరికా గ్రీన్ కార్డు కోసం తాను గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నట్లు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘పర్ప్లెక్సిటీ (Perplexity)’ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై బిలియనీర్ ఎలాన్ మస్క్ (elon musk) స్పందించారు. అమెరికా వీసా ప్రక్రియ (US visa system) అంతా తలకిందులు వ్యవస్థ అని అభివర్ణించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడం ఈ నిబంధనల వల్ల కష్టతరం అవుతోందని అన్నారు. డోనాల్డ్ ట్రంప్ దీన్ని సరిచేస్తారని ఆయన అన్నారు.
ట్రంప్ సరిదిద్దుతారు..
ఇతర దేశాల్లోని అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడం ఇక్కడి వీసా (visa) నిబంధనల కారణంగా కష్టంగా మారిందని, కానీ నేరస్థులు చట్టవిరుద్ధంగా సులభంగానే ఇక్కడకు వస్తున్నారని మస్క్ వ్యాఖ్యానించారు. ‘‘అమెరికాకు నోబెల్ బహుమతి గ్రహీతగా చట్టపరంగా రావడం కంటే, అక్రమంగా హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులభంగా మారింది? డొనాల్డ్ ట్రంప్ (donald trump) దీన్ని సరిచేస్తారు’’ అని ఎక్స్ లో శ్రీనివాస్ రాసిన పోస్టుకు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అమెరికాలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే గ్రీన్ కార్డు లేదా పర్మినెంట్ రెసిడెన్సీ కార్డు కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్నానని ఏఐ (artificial intelligence) కంపెనీ ‘పర్ప్లెక్సిటీ (Perplexity)’ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. ‘‘గ్రీన్ కార్డు కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ అది దక్కలేదు. ఇమ్మిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదు’’ అని శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 2022లో సామ్ ఆల్ట్ మన్ కు చెందిన ఓపెన్ఏఐ లో పనిచేశారు.