Shiv Sena symbol fight : ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో?
07 August 2023, 14:16 IST
Shiv Sena symbol fight : శివసేనకు చెందిన రెండు వర్గాలకు నోటీసులు ఇచ్చింది ఈసీ. పార్టీ చిహ్నంపై బలాన్ని నిరూపించుకోవాలని తేల్చిచెప్పింది.
ఎన్నికల సంఘం చేతిలో శివసేన 'చిహ్నం'- ఎవరికి దక్కేనో?
Shiv Sena symbol fight : రెండుగా చీలిపోయిన శివసేన పార్టీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది! ఇప్పుడు పార్టీ 'చిహ్నం'పై రెండు వర్గాల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. పార్టీ గుర్తును నిలుపుకునేందుకు అటు ఉద్ధవ్ ఠాక్రే, దానిని దక్కించుకునేందుకు ఇటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా.. ఇరు వర్గాలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పార్టీ చిహ్నం విషయంపై ముందు తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరువర్గాలకు స్పష్టం చేసింది. సంబంధిత పత్రాలను ఆగస్టు 8లోపు సమర్పించాలని పేర్కొంది.
1968 ఎన్నికల చిహ్నం(రిజర్వేషన్ అండ్ అలాట్మెంట్) ఆదేశాల్లోని 15వ పారాను ఉటంకిస్తూ.. శివసేనలోని రెండు వర్గాలకు ఈ నోటీసులిచ్చింది ఈసీ. శాసనసభ్యులు, పార్టీకి చెందిన వ్యవస్థాపక విభాగాల మద్దతుతో కూడిన పత్రాలను సమర్పించాలని వెల్లడించింది.
లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమకు గుర్తింపు లభించిందని, అందువల్ల శివసేన పార్టీ చిహ్నం తన వర్గానికే కేటాయించాలని.. వారం రోజుల క్రితం ఎన్నికల సంఘాన్ని ఏక్నాథ్ షిండే అభ్యర్థించారు. ఈ క్రమంలోనే పార్టీ చిహ్నం వ్యవహారంపై నోటీసులు జారీ చేసింది ఈసీ.
మహారాష్ట్ర స్థానిక ఎన్నికలకు పోలింగ్ నిర్వహించాలని, ఇందుకోసం రెండు వారాల్లోపు నోటిఫికేషన్‌ను జారీ చేయాలని.. ఎన్నికల సంఘానికి బుధవారమే ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో శివసేన పార్టీ చిహ్నం ఎవరికి దక్కుతుంది? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు.. ఎన్నికల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే లేఖ రాశారు. పార్టీ పేరు, చిహ్నం విషయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు.. తమ వాదనను వినాలని అభ్యర్థించారు.
‘మహా’ సంక్షోభం..
Mahrashtra politics : 2019 ఎన్నికల అనంతరం బీజేపీతో సంబంధం తెంచుకుని బయటకు వచ్చేసింది శివసేన. సీఎం కూర్చీని పంచుకునేందుకు బీజేపీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. ఆ తర్వాత.. ఎన్సీపీ- కాంగ్రెస్‌తో కలిసి మహా వికాస్ అఘాడీని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు.
దాదాపు మూడేళ్ల పాలన సాగిపోయింది. కానీ గత నెలలో శివసేనలో పెద్ద కుదుపు! పార్టీపై తీవ్ర అసంతృప్తితో బయటకొచ్చేశారు సీనియర్ నేత ఏక్నాథ్ షిండే. గుజరాత్‌లోని సూరత్‌కు మకాం మార్చేశారు. ఎవరి ఫోన్లూ ఎత్తలేదు. ఆయనతో పాటు 10-11మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్లారు. వారందరు.. అక్కడి నుంచి అసోంకు వెళ్లారు. వారికి రోజురోజుకు మద్దతు పెరిగింది. ఈ వ్యవహారం ముగిసే సమయానికి దాదాపు 40ఎమ్మెల్యేలు.. ఏక్‌నాథ్‌కు మద్దతుగా నిలిచారు.
Uddhav Thackerey : మరోవైపు ఉద్ధవ్ ఠాక్రేకు నిద్రలేని రోజులు తప్పలేదు. పార్టీపై పట్టుకోల్పోయారు. ఒకరకంగా చెప్పాలంటే.. పార్టీ రెండుగా చీల్చిపోయింది. ఆయన స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చివరికి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏక్నాథ్ షిండే. సీఎంగా ప్రమాణం చేశారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ విధంగా.. శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది.