War over Bal Thackeray legacy |అసలైన శివసేన ఎవరిది?
మహారాష్ట్రలో ఉత్కంఠభరిత పోరు ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఆ పోరాటంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై పార్టీ తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. ఇక బాల్ ఠాక్రే రాజకీయ, హిందుత్వ వారసత్వాన్ని, శివసేన పార్టీని, పార్టీ గుర్తును కైవసం చేసుకునే పోరులో విజయం ఎవరిదో?
శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గురువారం విజయవంతంగా మహారాష్ట్ర సీఎం పీఠం అధిష్టించారు. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు సాధించిన షిండే.. పార్టీ గుర్తును కూడా సాధించగలరా?
War over Bal Thackeray legacy : మరో పోరాటం
అసలైన శివసేన మాదేనంటే మాదేనని ఉద్ధవ్ వర్గం, షిండే వర్గం వాదిస్తున్నాయి. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుందని, మెజారిటీ కార్యకర్తలు కూడా తమవెంటే ఉన్నారని, అందువల్ల నిజమైన శివసేన తమదేనని ముఖ్యమంత్రి షిండే వాదిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ తమదేనని, ఒక అసంతృప్త వర్గం పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన.. అసలైన శివసేన కాకుండాపోమని ఉద్ధవ్ ఠాక్రే వర్గం స్పష్టం చేస్తోంది. వ్యవస్థాగత స్థాయిలో పార్టీలో తమకే మద్దతుందని వాదిస్తోంది.
బాలాసాహెబ్ వారసత్వం
బాలాసాహెబ్ బాల్ ఠాక్రే మహారాష్ట్రలో ఎదురులేని హిందుత్వ ప్రతినిధి. ఆయన సైద్ధాంతిక, రాజకీయ వారసత్వం ఇప్పుడు ఆయన కుమారుడు ఉద్దవ్ ఠాక్రేకు చెందుతుందా? లేక శివసేన లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ఏక్‌నాథ్ షిండేకు చెందుతుందా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బాలాసాహెబ్‌ను మొదట్నుంచి సైద్ధాంతికంగా, రాజకీయంగా వ్యతిరేకించిన ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసిన ఉద్ధవ్ ఠాక్రే.. ఆయన వారసత్వాన్ని కోరే హక్కును కోల్పోయాడని షిండే వర్గం వాదిస్తోంది. సైద్ధాంతిక సారూప్యం ఉన్న బీజేపీతో జట్టుకట్టిన తమదే అసలైన బాలాసాహెబ్ వారసత్వం అని చెబుతోంది.
ఎన్నికల సంఘం ముందుకు వివాదం
శివసేన పార్టీ, పార్టీ ఎన్నికల గుర్తు అయిన విల్లంబులు తమకే చెందాలని షిండే వర్గం త్వరలో ఎన్నికల సంఘం ముందుకు వెళ్లనుంది. దీన్ని ఉద్ధవ్ వర్గం కచ్చితంగా వ్యతిరేకిస్తుంది. ఇరు వర్గాల వాదనలు, చూపిన ఆధారాల మేరకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా, పార్టీ సంస్థాగత సభ్యలు, చట్ట సభల సభ్యుల మెజారిటీ ఆధారంగా ఈసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. కేవలం మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతున్నంత మాత్రాన పార్టీ గుర్తును కేటాయించదు. పార్టీ ఆఫీస్ బేరర్లు, అత్యున్నత నిర్ణయ కమిటీ, పార్టీలోని ఇతర కీలక పదవుల్లో ఉన్నవారి మద్ధతును కూడా పరిశిలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది.