తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Usa News: ‘‘దయచేసి అమెరికా రావద్దు.. మీ కలలు చెదిరిపోతాయి’’ - భారతీయ విద్యార్థులకు ఇండో అమెరికన్ అభ్యర్థన

USA news: ‘‘దయచేసి అమెరికా రావద్దు.. మీ కలలు చెదిరిపోతాయి’’ - భారతీయ విద్యార్థులకు ఇండో అమెరికన్ అభ్యర్థన

HT Telugu Desk HT Telugu

09 August 2024, 15:44 IST

google News
  • అమెరికా ఇప్పుడు చాలా మంది భారతీయ విద్యార్థులకు అంతిమ గమ్యం. ఏదో విధంగా యూఎస్ వెళ్లి, అక్కడ సెటిల్ కావాలన్నదే వారి లక్ష్యం. కానీ, ఆ ఆలోచన తొలగించుకోవాలని, యూఎస్ రావద్దని, అమెరికా వస్తే మీ కలలు కల్లలవుతాయని అక్కడ గత 20 ఏళ్లుగా ఉంటున్న ఒక ప్రవాస భారతీయుడు హెచ్చరిస్తున్నాడు.

‘దయచేసి అమెరికా రావద్దు.. మీ కలలు చెదిరిపోతాయి’’-భారతీయ విద్యార్థులకు అభ్యర్థన
‘దయచేసి అమెరికా రావద్దు.. మీ కలలు చెదిరిపోతాయి’’-భారతీయ విద్యార్థులకు అభ్యర్థన

‘దయచేసి అమెరికా రావద్దు.. మీ కలలు చెదిరిపోతాయి’’-భారతీయ విద్యార్థులకు అభ్యర్థన

విద్యార్థులు తమ అమెరికన్ కలను నెరవేర్చడానికి సరైన కళాశాలను ఎంచుకోవడంలో బిజీగా ఉన్న సమయం ఇది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవడం కోసం బ్యాంక్ ల నుంచి రుణాలు తీసుకుని, విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టి, అమెరికా విమానం ఎక్కుతున్నారు. వారి అంతిమ లక్ష్యం అమెరికాలో సెటిల్ కావడమే. అయితే..,

ప్లీజ్.. అమెరికా రావద్దు

రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న, అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను గట్టిగా విమర్శించే ప్రవాస భారతీయుడైన ఓ వ్యక్తి భారతీయ విద్యార్థులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికా వచ్చి, ఇక్కడ సెటిల్ కావాలనుకునే ఆలోచనను వదులుకోవాలని సూచిస్తున్నాడు. ‘‘దయచేసి #USA రావద్దు' అనే హెచ్చరికను వారు వినాలి. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తూ ఇక్కడి వారు చెప్పేవన్నీ అబద్ధాలు. నన్ను నమ్మడం లేదా? గత దశాబ్దంలో చదువుకోవడానికి ఇక్కడకు వచ్చిన వారితో మాట్లాడండి. మీ కలలు చెదిరిపోతాయి. చదువు అయిపోయాక భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం H1B వీసాలు, గ్రీన్ కార్డుల వెంట పడడంతోనే సరిపోతుంది. భారతీయ సంతతికి చెందిన వారు గ్రీన్ కార్డుల కోసం కనీసం 100 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది’’ అని సురేన్ అనే ఆ ప్రవాస భారతీయుడు ఎక్స్ లో రాశాడు.

కలలు చెదిరిపోతాయి..

అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రావాలని భారత విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన ఎక్స్ పోస్టుపై సురేన్ పై విధంగా స్పందించారు. ‘‘అమెరికాలోని 80కి పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులను కలిసి అడ్మిషన్లు, స్కాలర్ షిప్ లు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది. అమెరికాలో చదువుకోవాలన్న మీ కలను నిజం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి’’ అని గార్సెట్టి తన ఎక్స్ పోస్ట్ లో రాశారు. అయితే, ఈ పోస్ట్ కు కామెంట్ గా సురేన్ పై విధంగా స్పందించారు.

యూఎస్ లోని భారతీయ విద్యార్థుల వేదన

అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థతో నిరాశకు గురవుతున్న భారతీయ వలసదారుల వేదనను సురేన్ హెచ్చరిక ప్రతిధ్వనించింది. ‘‘నేను 21 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి అమెరికా వచ్చాను. ఆ కాలాలు వేరు. వచ్చే 2 దశాబ్దాల్లో అమెరికా కన్నా ఇండియా పరిస్థితే బావుంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణ దయనీయం’’ అని సురేన్ ఎక్స్ లో రాసుకొచ్చారు.

కెనడాకు కూడా రావద్దు..

అమెరికా మాత్రమే కాదు.. కెనడాకు కూడా రావద్దని, అక్కడ కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవని మరో ఎక్స్ యూజర్ తెలిపారు. ‘‘కెనడాకు కూడా రావద్దు. మీకు పౌరసత్వం లభిస్తుంది. కానీ ఇప్పుడు దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కెనడాలో చాలా మందికి ఉద్యోగాలు లేవు. శాంతిభద్రతల పరిస్థితి మనందరికీ తెలుసు’’ అని అదే పోస్ట్ కు స్పందనగా మరో యూజర్ రాశారు.

అమెరికా విద్య, హెచ్-1బీ వీసా ట్రాప్

ఎంతో మంది భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడం లక్ష్యం. చదువు అనంతరం అక్కడే అధిక వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు లభిస్తాయని, దాంతో, హ్యాప్పీగా సెటిల్ కావచ్చని వారు ఆశిస్తారు. కానీ, వాస్తవం వేరుగా ఉంది. అమెరికాలో సెటిల్ కావడం ఇప్పుడు సవాళ్లతో కూడుకున్నది. గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీయులు అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ వీసా అయిన హెచ్-1బీ వీసా (h1b visa)ను పొందడం దాదాపు అసాధ్యమనే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులతో హెచ్-1బీ వీసా ప్రక్రియ అత్యంత పోటీగా ఉంది. హెచ్-1బీ వీసా పొందిన వారు కూడా పరిమిత ఉద్యోగ కదలికలు, ఉద్యోగ స్థితి మారితే వీసా (visa) గడువు ముగిసే ప్రమాదం వంటి పరిస్థితుల వల్ల తమ కెరీర్, జీవితాలు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటాయి.

గ్రీన్ కార్డ్ కోసం వందేళ్ల ఎదురుచూపు

యూఎస్ లో సెటిల్ కావాలనుకుంటున్న భారతీయులకు ఎదురవుతున్న మరో సమస్య గ్రీన్ కార్డు పొందడం. ప్రస్తుత అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం గ్రీన్ కార్డులను ప్రతి దేశానికి 7 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డుల బ్యాక్ లాగ్ లను పరిశీలిస్తే, గ్రీన్ కార్డ్ పొందడానికి కనీసం 100 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ చాలా మంది నైపుణ్యం కలిగిన నిపుణులను, వారి కుటుంబాలను నిరంతర అనిశ్చితి స్థితిలో ఉంచుతుంది. ఏళ్ల తరబడి అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, కొన్నిసార్లు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వారు శాశ్వత నివాస హోదాను పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాకుండా గణనీయమైన వ్యక్తిగత పరిణామాలను కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా గృహాలను కొనలేరు, వ్యాపారాలలో పెట్టుబడి పెట్టలేరు లేదా అమెరికన్ సమాజంలో పూర్తిగా విలీనం కాలేరు.

తదుపరి వ్యాసం