Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు-indian students facing deportation in canada protest against govt ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

HT Telugu Desk HT Telugu
May 17, 2024 03:00 PM IST

రాత్రికి రాత్రే ప్రభుత్వం ఇమిగ్రేషన్ నిబంధనలను మార్చి తమకు వర్క్ పర్మిట్లు ఇవ్వడం నిరాకరించడాన్ని నిరసిస్తూ కెనడాలో వందలాది మంది భారతీయ విద్యార్థులు నిరసనల బాట పట్టారు. కెనడా ప్రభుత్వం అకస్మాత్తుగా మార్చిన నిబంధనల కారణంగా తాము ఇప్పటికిప్పుడు స్వదేశం వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

కెనడాలో వర్క్ పర్మిట్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయ విద్యార్థులు
కెనడాలో వర్క్ పర్మిట్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారతీయ విద్యార్థులు

కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ (PEI) ప్రాంతంలో వందలాది మంది భారతీయ విద్యార్థులు తమను దేశంలో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ తమకు వర్క్ పర్మిట్లు నిరాకరిస్తున్నారని, ఇప్పుడు తాము దేశం విడిచి వెళ్లాల్సి వస్తోందనివారు ఆందోళనకు గురవుతున్నారు. డిమాండ్లు నెరవేర్చకపోతే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

వర్క్ పర్మిట్స్ ఇవ్వలేం..

కెనడా ప్రభుత్వం రాత్రికి రాత్రే ఈ విధానాన్ని మార్చిందని ఏడాదికి పైగా దేశంలో ఉన్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘‘ఇక్కడికి రావడానికి వారే మమ్మల్ని అనుమతించారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత వర్క్ పర్మిట్ ఇస్తామన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా నిబంధనలు మార్చాం, దేశం విడిచి వెళ్లమంటున్నారు. ఇదెక్కడి న్యాయం’’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ‘‘ఈ ప్రావిన్స్ మాకు తప్పుడు ఆశలు చూపింది" అని ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న రూపేందర్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఆయన 2019 లో భారతదేశం నుండి కెనడాకు వచ్చాడు. ‘మాకు జీవితంలో ఒక్కసారే అవకాశం లభిస్తుంది. ఆరు నెలలు, లేదా ఏడాది తర్వాత పీఆర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వారు అవకాశంఇవ్వడంతో పీఈఐకి వచ్చాం. ఇప్పుడు నిబంధనలు మార్చి వెళ్లిపోవాలంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

వీధుల్లో నిరసనలు, ర్యాలీలు

ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ లోని షార్లెట్టాన్ వీధుల్లో భారతీయ విద్యార్థులు ప్రభుత్వ తీరుకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. న్యాయం కోసం నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకున్న వందలాది విద్యార్థులు అందులో పాల్గొన్నారు. తమకు వర్క్ పర్మిట్ ఇవ్వకపోవడం వల్ల తమకే కాకుండా, స్థానికులకు కూడా నష్టమేనని మరో విద్యార్థి వివరించాడు. ‘‘మేం లేకుంటే స్థానికులకు టీ, కాఫీ వంటి నిత్యావసర సేవలు కూడా ఆలస్యమవుతాయి’ అన్నారు. అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు లేకుండా, టిమ్ హోర్టన్స్ లో కాఫీ వంటి సేవలలో జాప్యం జరుగుతుందన్నారు.

కెనడా లోని పీఈఐ చట్టం ఏమి చెబుతుంది?

నిర్దిష్ట అర్హతలు ఉన్న విద్యార్థులకు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లు ఇస్తామని చెబుతూ గత జూలైలో పీఈఐ ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం నిర్మాణ రంగం, ఆరోగ్య సంరక్షణ రంగం.. వంటి కొన్ని డిసిప్లిన్స్ లో విద్యార్హతలు ఉన్న విద్యార్థులకు మాత్రమే వర్క్ పర్మిట్స్ లభిస్తాయి. దీనివల్ల చాలా మంది అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ లభించదు. దానివల్ల వారు కెనడాలో పనిచేయడం కొనసాగించలేరు.

మానిటోబాలో కూడా..

ఈ సంవత్సరం ప్రారంభంలో కెనడాలోని మానిటోబాలో కూడా ఇలాంటి ఆంక్షలు విధించబడ్డాయి. కానీ విదేశీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగడంతో కెనడా అధ్యక్షుడు ట్రూడో ప్రభుత్వం ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లను రెండు సంవత్సరాల పాటు పొడిగించారు. ఇప్పుడు పీఈఐలోని విద్యార్థులు కూడా ఇదే తరహాలో తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

నిరసన తెలుపుతున్న భారతీయ విద్యార్థుల డిమాండ్

వర్క్ పర్మిట్లను పొడిగించాలని, ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఇటీవల చేసిన మార్పులను పునఃసమీక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వర్క్ పర్మిట్ కు అవకాశం కల్పించే గత నిబంధనలు అమలులో ఉన్న సమయంలో కెనడా (Canada)కు వచ్చిన విద్యార్థులకు.. అవే నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా కెనడాకు వచ్చే విద్యార్థులకు మాత్రమే కొత్త నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, మే రెండో వారం నుంచి నిరాహార దీక్ష చేపడతామని వారు డెడ్ లైన్ విధించారు.

Whats_app_banner