Delhi AQI : దిల్లీలో డేంజర్ బెల్స్.. దారుణంగా గాలి నాణ్యత.. రోజుకు 49 సిగరేట్లు కాల్చడంతో సమానం
18 November 2024, 16:10 IST
- Delhi AQI : దేశ రాజధాని దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ దారుణంగా క్షీణిస్తోంది. వాయు కాలుష్యం స్థాయిలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన మెుదలైంది.
దిల్లీ గాలి నాణ్యత
దిళ్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుండటం ఆందోళనకరంగా మారింది. తగ్గుతున్న గాలి నాణ్యత ప్రతిరోజూ ఒక వ్యక్తి ధూమపానం చేసేదానికంటే ఘోరంగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో ఏక్యూఐ 978 ఉంది అంటే.. ఒక వ్యక్తి రోజుకు 49.02 సిగరెట్లు పీల్చడంతో సమానం అన్నమాట.
అక్టోబర్ నెలాఖరు నుంచి దిల్లీలో గాలి నాణ్యత తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ ఇది తీవ్రమవుతోంది. బాణసంచా కాల్చడం, పంట వ్యర్థాలను కాల్చడం వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవిస్తోంది. ఊహించిన దానికంటే ఎక్కువ ఏక్యూఐతో దిల్లీవాసులు తీవ్ర భయాందోళనలు ఎదుర్కొంటున్నారు.
aqi.in ప్రకారం నవంబర్ 18 మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి దేశ రాజధానిలో వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 978 గా ఉంది. అంటే 24 గంటల్లో 49.02 సిగరెట్లు తాగడంతో ఇది సమానం. గాలి నాణ్యత క్షీణిస్తుండటంపై సుప్రీం కోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినప్పటికీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) స్టేజ్ 4ను అమలు చేయడంలో జాప్యంపై దిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఏక్యూఐ 450 కంటే దిగువకు పడిపోయినా జీఆర్ఏపీ 4వ దశ కింద నివారణ చర్యలను తగ్గించడానికి అనుమతించబోమని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
మరోవైపు కాలుష్య తీవ్రతో దిల్లీలో పలు ఆంక్షలు విధిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరుగుతున్నాయి. జీఆర్ఏపీ కింద మరిన్ని నిబంధనలు అమలు చేయనున్నారు. గాలి నాణ్యతలో దిల్లీ తర్వాత పొరుగు రాష్ట్రమైన హరియాణా రెండో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 631గా ఉంది. అంటే ఒక వ్యక్తి ప్రతిరోజూ 33.25 సిగరెట్లు తాగడానికి ఇది సమానం.
హర్యానా, దిల్లీ ప్రతి సంవత్సరం వ్యర్థాలను కాల్చడం నుండి వచ్చే పొగ, ఆ విష కణాలకు గురవుతాయి. aqi.in ప్రకారం, ఉత్తరప్రదేశ్ వాయు నాణ్యత సూచిక 273 గా ఉంది. ఇది రోజుకు 10.16 సిగరెట్లు తాగడానికి సమానం. పంట వ్యర్థాలను కాల్చడం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. ఈ రాష్ట్రంలో ఏక్యూఐ 233 ఉండగా ఒక వ్యక్తి రోజుకు 8.34 సిగరెట్లు తాగుతున్నట్టు లెక్క.
ఇండియా ఇన్ పిక్సెల్స్ డేటా మ్యాప్ ప్రకారం లద్దాఖ్‌లో స్వచ్ఛమైన గాలి ఉంది. ఇక్కడ ఉన్నవారు ప్రతిరోజూ జిరో సిగరెట్లు తాగడంతో సమానం. అరుణాచల్ ప్రదేశ్‌లో వాయు నాణ్యత సూచిక 13 ఉంది. ఇది రోజుకు 0.18 సిగరెట్లు తాగడానికి సమానం.