ఆప్‌కు రాజీనామా చేసిన దిల్లీ మంత్రి.. మరోవైపు పార్టీలో చేరిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే
AAP : దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేయగా, మరోవైపు బీజేపీ నేత అనిల్ ఝా పార్టీలో చేరారు.
దిల్లీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే అనిల్ ఝా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. ఆయనకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వాగతం పలికారు. దిల్లీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
అనిల్ ఝా మాట్లాడుతూ 'సామాజిక న్యాయం, పూర్వాంచలీలు నివసించే మురికివాడలు, మెరుగైన విద్య, ఆరోగ్యం, భద్రత కోసం అరవింద్ కేజ్రీవాల్ చాలా కృషి చేశారు. నీటి సరఫరా లైన్లు, లోపభూయిష్ట మురుగునీటి వ్యవస్థల సమస్యలతో సహా, ఈ ప్రాంత నివాసితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ హయాంలో 10 ఏళ్లలో ప్రతి ఇంటికి తాగునీరు చేరింది.' అని ఝా అన్నారు.
అనిల్ ఝాను పార్టీలో చేర్చుకున్న అరవింద్ కేజ్రీవాల్.. ఆయన చేరికను స్వాగతిస్తున్నానని చెప్పారు. సమాజానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. దిల్లీలోని పూర్వాంచలి సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయనను అభివర్ణించారు. విద్య, ఉపాధి కోసం దిల్లీలో స్థిరపడిన ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజల అవసరాలను బీజేపీ, కాంగ్రెస్‌లు ఏళ్ల తరబడి విస్మరించాయని కేజ్రీవాల్ విమర్శించారు.
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని కిరారీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఝా. బీజేపీ నాయకత్వం, విధానాలే పార్టీ మార్పునకు కారణం అని చెప్పారు.
మరోవైపు దిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి రాజీనామా చేశారు. కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా తనపై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తున్నాయన్నారు. దిల్లీలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. 'రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండింటికీ అధికారాలు, వనరులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అపరిమిత అధికారం ఉంది. దిల్లీ ప్రభుత్వానికి తక్కువ అధికారం ఉంది.' అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
పూర్వాంచలి ఓటు ఒకప్పుడు ఎక్కువగా కాంగ్రెస్‌కు ఉండేది. 2015 దిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆప్ వైపు భారీగా మళ్లింది. ఆప్‌లో ఝా చేరికతో వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్నందున ఓటు బ్యాంక్ కేజ్రీవాల్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. పూర్వాంచలి జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గమైన కిరారి గతంలో ఆప్‌కి సవాలుగా నిలిచింది.