Hyderabad Pollution : హైదరాబాద్ నగరంలో క్షీణిస్తున్న గాలి నాణ్యత.. ఈ ప్రాంతాల్లో డేంజర్ బెల్స్!
Hyderabad Pollution : హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా గాలి నాణ్యత తగ్గింది. కేవలం గంటల వ్యవధిలోనే పొల్యూషన్ పెరిగిపోయింది. కొన్ని ఏరియాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగినట్టు సీపీసీబీ వెల్లడించింది. కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గురువారం రాత్రి హైదరాబాద్ నగరంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ.. అనుకోని అతిథిని తీసుకువచ్చాయి. దీపావళి బాణసంచా కారణంగా ప్రమాదకరమైన స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆకాశంలో పటాకుల ఉద్గారాలు నిండిపోవడంతో గాలి నాణ్యత తగ్గిందని వివరిస్తున్నారు. దీనివల్ల పర్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రత గణనీయంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. కొంపల్లిలో పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 స్థాయి దాటింది. ఈ స్థాయికి వస్తే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ కణాలు ఊపిరితిత్తులలోకి చొచ్చుకుపోయి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు వస్తాయని అంటున్నారు. అటు సోమాజిగూడలోను ఇదే పరిస్థితి ఉందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది.
గచ్చిబౌలి, కోకాపేట్, సనత్‌నగర్‌లోనూ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్ అయినట్టు వెల్లడించింది. వాయు కాలుష్య పెరుగుదలకు బాణసంచా ప్రధాన కారణం అయినప్పటికీ.. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్‌తో సహా ఇతర కాలుష్య కారకాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇవి గాలి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయి. ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తూనే ఉన్నాయి.
నవంబర్ 1వ తేదీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో గాలి నాణ్యత 171గా నమోదైంది. ఇది తీవ్రస్థాయి కాలుష్యం అని నిపుణులు చెబుతున్నారు. మలక్‌పేట్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో 335గా నమోదైంది. దీపావళి టపాసుల వల్ల ఏమేర వాయు కాలుష్యం జరిగిందో దీన్నిబట్టి అర్థం అవుతోంది. వాయు కాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా గుండె, శ్వాసకోశ, మూత్రపిండాలు, కాలేయం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారిపై వాయు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్తున్నారు.
హైదరాబాద్ నగరంలో కాలుష్యం కారణంగా గత దశాబ్దకాలంలో 6 వేల మందికి పైగా మరణించినట్టు నివేదికలు చెప్తున్నాయి. లాన్సెట్ ప్లానెట్ హెల్త్ సంస్థ రిపోర్ట్ ప్రకారం.. హైదరాబాద్‌లో ఒక్క 2023లోనే వాయు కాలుష్యం వల్ల 1,597 మంది మరణించారు. వాయు కాలుష్యం అధికంగా ఉన్న టాప్-10 నగరాల్లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. 2వ స్థానంలో ముంబై, మూడో స్థానంలో బెంగళూరు, 4వ స్థానంలో పూణె, ఐదో స్థానం చెన్నై నగరాలు ఉన్నాయి.