తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rape Case : ఇష్టంతోనే వెళ్లారు.. తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళపై చర్యలు తీసుకోండి.. కోర్టు ఆదేశాలు

Rape Case : ఇష్టంతోనే వెళ్లారు.. తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళపై చర్యలు తీసుకోండి.. కోర్టు ఆదేశాలు

Anand Sai HT Telugu

28 July 2024, 17:49 IST

google News
    • Rape Case : అత్యాచారం చేసినట్టుగా తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని దిల్లీ కోర్టు ఆదేశించింది. ప్రత్యేక హక్కులను ఇలా తప్పుడుగా ఉపయోగించకూడదని పేర్కొంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం

మహిళలకు ఇచ్చే ప్రత్యేక హక్కులను వ్యక్తిగత పగను తీర్చుకోవడానికి కత్తిగా ఉపయోగించరాదని దిల్లీ హైకోర్టు చెప్పింది. తప్పుడు అత్యాచారం కేసు నమోదు చేసినందుకు ఒక మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. అదనపు సెషన్స్ జడ్జి షెఫాలీ బర్నాలా టాండన్ మాట్లాడుతూ.. ఇలాంటి తప్పుడు ఆరోపణలు నిందితుల జీవితాన్ని, ప్రతిష్టను, వారి కుటుంబ సామాజిక స్థితిని నాశనం చేస్తాయని అన్నారు.

నిందితుడి బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టే సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు వాస్తవాలను గమనించిన కోర్టు జూలై 14న వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపింది. అయితే మరుసటి రోజు ప్రాసిక్యూట్రిక్స్ మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె నిందితుడితో స్వచ్ఛందంగా ఒక హోటల్‌కు వెళ్లిందని, అక్కడ వారు ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొంది.

నిందితుడితో గొడవ పడిన తర్వాత ఆమె పోలీసులను పిలిపించి ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ జూలై 25 నాటి ఉత్తర్వులో ప్రాసిక్యూట్రిక్స్ కోర్టు ముందు అదే వాస్తవాలను పేర్కొంది. 'రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం ప్రకారం మన దేశంలోని పురుషులకు సమాన హక్కులు, రక్షణ ఉన్నాయి. అయితే మహిళలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఈ ప్రత్యేక హక్కు, చట్టాలు కత్తిగా మారకూడదు.' అని కోర్టు పేర్కొంది.

'ఈ రోజుల్లో అనేక ఇతర కారణాలతో రేప్ ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి కేసుల్లో ఒకటి. తప్పుడు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ప్రతిష్టను కూడా నాశనం చేస్తాయి. అతని కుటుంబ సభ్యులు సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.' అని కోర్టు చెప్పింది.

అత్యాచారం అత్యంత దారుణమైన నేరమని కోర్టు పేర్కొంది. ఎందుకంటే ఇది బాధితురాలి ఆత్మతో పాటు ఆమె శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అత్యాచారానికి వ్యతిరేకంగా చట్టం దుర్వినియోగం అవుతోందని కోర్టు అభిప్రాయపడింది.

'చట్టం.. నేరం జరిగితే క్రిమినల్ ఫిర్యాదు చేసే పరిష్కారాన్ని అందించింది. అయితే ఫిర్యాదుదారు ఉద్దేశ్యాన్ని సంతృప్తి పరచడానికి లేదా నిందితులకు గుణపాఠం చెప్పడానికి అటువంటి పరిష్కారాన్ని సాధనంగా ఉపయోగించకూడదు.' అని కోర్టు వ్యాఖ్యానించింది.

స్త్రీపురుషులు సమాజానికి రెండు స్తంభాలు అని, ప్రతి అంశంలో సమానమని కోర్టు వెల్లడించింది. లింగ దుర్వినియోగం ఆధారంగా ఒకరు మరొకరిని అధిగమించకూడదని చెప్పింది. కోపంతో, మత్తులో ఉన్న స్థితిలో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఫిర్యాదుదారుపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిల్లీ నగర పోలీసులను కోర్టు ఆదేశించింది. దీని కారణంగా వ్యక్తి సుమారు 10 రోజుల పాటు జైలులో ఉన్నారని గుర్తు చేసింది.

చట్టం ప్రకారం తగిన కారణాలను రాసిన తర్వాత ప్రాథమిక విచారణ లేదా దర్యాప్తు అవసరమయ్యే కేసులలో నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు తొందరపడవద్దని కోర్టు సూచించింది. తప్పుడు ఫిర్యాదు ఆధారంగా నిర్దోషికి జైలు శిక్ష విధిస్తే.. దానికి చెల్లించే పరిహారం ఉండదని వ్యాఖ్యానించింది. ఆర్డర్ కాపీని సంబంధిత పోలీసు డిప్యూటీ కమిషనర్‌కు పంపాలని, 10 రోజుల్లోగా కంప్లైంట్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. అరెస్టు అయిన వ్యక్తిని బెయిల్‌పై విడుదల చేస్తూ, ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున బెయిల్ బాండ్, ష్యూరిటీ బాండ్ అందించాలని ఆదేశించింది.

టాపిక్

తదుపరి వ్యాసం