Revanna bail: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ నేత రేవణ్ణకు కండిషనల్ బెయిల్ మంజూరు-jds mlc suraj revanna granted conditional bail in sexual abuse case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Revanna Bail: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ నేత రేవణ్ణకు కండిషనల్ బెయిల్ మంజూరు

Revanna bail: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ నేత రేవణ్ణకు కండిషనల్ బెయిల్ మంజూరు

HT Telugu Desk HT Telugu
Jul 24, 2024 04:27 PM IST

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్నకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అతనిపై ఐపీసీ సెక్షన్ 377, 342, 506, 34 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ నేత రేవణ్ణకు కండిషనల్ బెయిల్
లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ నేత రేవణ్ణకు కండిషనల్ బెయిల్

Revanna bail: లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్ కార్యకర్త అయిన 27 ఏళ్ల యువకుడిపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా సూరజ్ రేవణ్నపై కేసు నమోదైంది. దాంతో, ఆయనను గత నెలలో హసన్ పోలీసులు అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది.

ప్రజ్వల్ రేవణ్ణకు సోదరుడే

సూరజ్ రేవణ్నపై ఐపీసీ సెక్షన్లు 377 (అసహజ నేరాలు), 342 (అక్రమ నిర్బంధం), 506 (క్రిమినల్ బెదిరింపు), 34 (కుట్రలో ఇతరుల ప్రమేయం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సూరజ్ రేవణ్న పలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు. హొళెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ పెద్ద కుమారుడు. అలాగే, మాజీ ప్రధాని దేవెగౌడకు మనవడు.

సహచరుడిపై లైంగిక వేధింపులు

సూరజ్ రేవణ్న జూన్ 16న ఘన్నికాడలోని తన ఫాంహౌస్ లో తనను లైంగికంగా వేధించాడని 27 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూరజ్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆ వ్యక్తి తన నుంచి రూ.5 కోట్లు వసూలు చేసేందుకు ఈ తప్పుడు ఫిర్యాదు చేశారని సూరజ్ ఆరోపించారు. ఈ మేరకు ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

షరతులతో బెయిల్..

ఈ నేపథ్యంలో, సూరజ్ రేవణ్నకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఫిర్యాదు దారుడిని కలవడం, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కాంటాక్ట్ చేయాలని ప్రయత్నించడం, బెదిరించడం వంటివి చేయకూడదని, సాక్షులపై ఒత్తడి తేవద్దని కోర్టు షరతు విధించింది. ఎప్పుడు పిలిచినా దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని, తన పాస్ పోర్టును కోర్టుకు సమర్పించాలని, కోర్టు నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోకుండా రాష్ట్రం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ప్రతి నెల రెండో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా చార్జిషీట్ దాఖలు చేసే వరకు విచారణాధికారి ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.

బాధితురాలి కిడ్నాప్

ప్రజ్వల్ రేవణ్ణ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు ప్రజ్వల్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధితురాలిని కిడ్నాప్ చేశారని ప్రజ్వల్, సూరజ్ ల తండ్రిపై ఆరోపణలు వచ్చాయి. దాంతో, ఆయనను కూడా పోలీసులు అరెస్ట చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నాడు. ఇదే కేసులో ప్రజ్వల్ రేవణ్న తల్లి భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పొందారు.

Whats_app_banner