Fake Passport Scam : ఫేక్ పాస్ పోర్టుల స్కామ్ లో పోలీసుల హస్తం, ఇద్దరు అధికారులు అరెస్ట్!-hyderabad crime news ts cid arrested two police officers in fake passport case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fake Passport Scam : ఫేక్ పాస్ పోర్టుల స్కామ్ లో పోలీసుల హస్తం, ఇద్దరు అధికారులు అరెస్ట్!

Fake Passport Scam : ఫేక్ పాస్ పోర్టుల స్కామ్ లో పోలీసుల హస్తం, ఇద్దరు అధికారులు అరెస్ట్!

HT Telugu Desk HT Telugu
Jan 28, 2024 09:50 PM IST

Fake Passport Scam : తెలంగాణలో ఫేక్ పాస్ పోర్టు స్కామ్ సంచలనమవుతుంది. హైదరాబాద్ కేంద్రంగా మొత్తం 92 నకలీ పాస్ పోర్టులు జారీ అయినట్లు సీఐడీ అధికారులు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను చేయగా... వీరిలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు.

నకిలీ పాస్ పోర్టు కేసు
నకిలీ పాస్ పోర్టు కేసు

Fake Passport Scam : తెలంగాణలో సంచలనం సృష్టించిన నకిలీ పాస్ పోర్టు స్కామ్ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పెద్ద మొత్తంలో శ్రీలంకకు నకిలీ పాస్ పోర్టులు తీసుకువెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్టు కేంద్రంగా మొత్తం 92 పాస్ పోర్టులు జారీ అయినట్లు అధికారులు వివరించారు. అయితే కొంతమంది పోలీసు అధికారుల పాత్ర కూడా ఈ స్కాంలో ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్టు చేసిన సీఐడీ... మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏజెంట్ మురళీధరన్ ఈ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా అధికారులు నిర్ధారించారు. మొత్తం స్కాం మురళీధరన్ మూలంగానే జరిగిందని అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకు 14 మంది నిందితులు అరెస్ట్

ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేశామన్న ఆమె..... తమిళనాడుకు చెందిన ట్రావెల్ ఏజెంట్ మురళీధర్ ద్వారా నకిలీ పాస్ పోర్టు రాకెట్ గుర్తించామన్నారు. శ్రీలంక దేశస్థులు ఎక్కువ మంది అడ్డదారిలో పాస్ పోర్టులు పొందారని ఆమె వెల్లడించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టమన్నారు. హైదరాబాద్ కు చెందిన సత్తార్, తమిళనాడుకు చెందిన మురళీధరన్ నకిలీ పాస్ పోర్టులు సృష్టించి...మొత్తం స్కాంను నడపారాన్నారు. వివిధ జిల్లాల్లో పాస్ పోర్టు బ్రోకర్లతో పాటు తమిళనాడు మెయిన్ బ్రోకర్ ని అదుపులోకి తీసుకున్నామన్నారు.

నకిలీ పాస్ పోర్ట్ కేసులో ఇద్దరు పోలీస్ అధికారులు అరెస్ట్

కరీంనగర్ ,హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్ పోర్టులు పొందినట్లు గుర్తించామని షికా గోయల్ తెలిపారు. కొందరు విదేశీయులకు నకిలీ ఐడీ ప్రూఫ్ పెట్టి పాస్ పోర్టులు ఇప్పించినట్లు గుర్తించామన్నారు. 92 మంది ఇలా నకిలీ పాస్ పోర్టులు పొందారన్నారు. ఇందులో కొంతమంది నకిలీ పాస్ పోర్టులతో విదేశాల్లో ఉన్నారన్నారు. పాస్ పోర్టు పొందిన వారిలో ఎక్కువ మంది శ్రీలంక దేశానికి చెందిన వారేనన్నారు. పాస్ పోర్టులు ఇప్పించడంలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు గుర్తించి వారిని కూడా అరెస్ట్ చేశామని షికా గోయల్ తెలిపారు. పలువురు ఎస్బీ, పాస్ పోర్ట్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నామన్నారు. 12 మంది నిందితులను ఐదు రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చిందని, పాస్ పోర్టు స్కాం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని తెలంగాణ సీఐడీ అడిషనల్ డీజీ షికా గోయల్ తెలిపారు.

కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner