Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత-delhi brs mlc kavitha judicial custody extended sensational comments on prajwal revanna case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Bandaru Satyaprasad HT Telugu
May 07, 2024 09:16 PM IST

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఆమె కస్టడీని మరో వారం పొడిగిస్తూ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆమెకు ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగించింది. కోర్టును బయటకు వస్తూ ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారని, మాలాంటి వారిని అన్యాయంగా అరెస్టు చేశారని క‌విత ఆరోపించారు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నానన్నారు. కర్ణాటకకు చెందిన జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ స్కాండల్‌ కలకలం రేపుతోంది. ఎంతో మంది బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. రేవణ్ణ ఆయన తండ్రి చేసిన దురఘతాలు వెలుగుచూస్తున్నాయి. కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొత్తం రేవణ్ణ సెక్స్‌ స్కాండల్‌ చుట్టూనే తిరుగుతుంది. ఈ కేసుపై సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కవితకు మరో వారం కస్టడీ పొడిగింపు

బీఆఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. కవిత కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మే 14న కవితను తిరిగి కోర్టులో హాజరు పర్చాలని జడ్జ్ ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును కోర్టుకు వివరించిన ఈడీ, సీబీఐ న్యాయవాదులు... వారం రోజుల్లో ఛార్జ్‌ షీట్‌ను దాఖలు చేస్తామన్నారు. ఎమ్మెల్సీ కవితకు జైలులో చదవడానికి 10 పుస్తకాలు అనుమతించాలని కోర్టును ఆమె న్యాయవాది నితీష్ రాణా విజ్ఞప్తి చేశారు. అలాగే కవితను 15 నిమిషాల పాటు కలిసిసేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. జైలులో తన కుటుంబ సభ్యులు తెచ్చిన ఆహారం తినేందుకు అనుమతించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు.

కేజ్రీవాల్ కు మరో 14 రోజుల కస్టడీ పొడిగింపు

ఇదే కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ చుక్కెదురైంది. కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మంగళవారంతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు కేజ్రీవాల్‌కు మరో 14 రోజుల కస్టడీ పొడిగించింది. మే 20న ఆయనను తిరిగి కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేజ్రీవాల్ మరో 14 రోజులు తీహార్ జైలులో ఉండాల్సి ఉంది. దిల్లీ లిక్కర్ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగాయి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకునే హక్కు ఆయనకు ఉందని కోర్టు అభిప్రాయపడింది. అయితే బెయిల్ ఇస్తే సీఎం విధులకు దూరంగా ఉండాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ వాదనలు ముగియగా... ఇంకా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించలేదు. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఆప్ పిటిషన్ దాఖలు చేసింది.

సంబంధిత కథనం