Delhi cop: ‘‘నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించినందుకు పోలీసునే కారుతో ఢీ కొట్టి చంపేశారు’’
29 September 2024, 15:22 IST
Delhi crime news: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయొద్దని హెచ్చరించినందుకు ఒక కానిస్టేబుల్ ను కారుతో గుద్ది చంపేశారు. ఢిల్లీలోని నాగలోయ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఆ కానిస్టేబుల్ బైక్ పై పోలీస్ స్టేషన్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పోలీసు యూనిఫామ్ లో లేడని అధికారులు తెలిపారు.
ఢిల్లీలో కానిస్టేబుల్ హత్య
Delhi crime news: గత రాత్రి ఢిల్లీలోని నాగలోయ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ ప్రయాణిస్తున్న బైక్ ను వెనుకనుంచి ఢీ కొట్టి,10 మీటర్లు ఈడ్చుకెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సందీప్ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.
నిర్లక్ష్యంగా నడపవద్దన్నందుకు..
అనంతరం, కొద్ది దూరంలో ఆ కారును వదిలిపెట్టి, అందులోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వేగంగా వచ్చిన కారు 30 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ ను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
అసలేం జరిగింది..
ఆదివారం తెల్లవారుజామున 2:16 గంటలకు ఆ ప్రాంతంలో దొంగతనాలు పెరిగాయని దర్యాప్తు చేసేందుకు డ్యూటీలో ఉన్న సందీప్ సాధారణ దుస్తుల్లో బైక్ పై వెళ్తున్నాడు. నాగలోయ్ ప్రాంతంలో వేగంగా వచ్చిన వ్యాగన్ ఆర్ అతడిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటంతో వేగం తగ్గించాలని కోరాడు. కారులోని వారిని వేగంగా వెళ్లవద్దని, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయవద్దని కానిస్టేబుల్ సందీప్ మందలించాడు. ఆ సమయంలో కారు డ్రైవర్ కు, కానిస్టేబుల్ సందీప్ కు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తరువాత బైక్ పై వెళ్తున్న కానిస్టేబుల్ సందీప్ ను వారు వెనుక నుంచి వేగంగా వచ్చి కారుతో ఢీ కొట్టారు. ఢీకొట్టడంతో పాటు అతడిని, అతడి మోటార్ సైకిల్ ను సుమారు 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు. అక్కడ ముందున్న మరో వాహనాన్ని ఢీ కొట్టి, అక్కడి నుంచి పరారయ్యారు. సందీప్ ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, అనంతరం మరో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తల్లి, భార్య, కుమారుడు
కారులో ఇద్దరు ఉన్నారని, వారు సంఘటన అనంతరం పారిపోయారని పోలీసులు తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు అనుమానితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి హత్య కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ సందీప్ కు తల్లి, భార్య, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు. సందీప్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా ఒక వ్యాగన్ ఆర్ కారు అతివేగంతో అతన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిందని, వాగ్వాదం జరిగిన తరువాత, డ్రైవర్ వేగంగా వచ్చి సందీప్ బైక్ ను వెనుక నుండి ఢీకొట్టి, సుమారు 10 మీటర్లు ఈడ్చుకెళ్లి మరో వాహనాన్ని ఢీకొట్టాడని సీనియర్ పోలీసు అధికారి జిమ్మీ చిరామ్ తెలిపారు.