Bengaluru Fridge Horror : బెంగళూరు మహాలక్ష్మి హత్య కేసు నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య
Bengaluru Fridge Horror : బెంగళూరులో మహిళను అత్యంత దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన దేశాన్ని మెుత్తం కదిలించింది. అయితే ఈ కేసులో నిందితుడు ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
బెంగళూరులోని ఓ ఇంట్లో మహాలక్ష్మి అనే మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టాడు. ఈ కేసును కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ దారుణ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఒడిశాలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రకటించారు.
నిందితుడు ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ ఆత్మహత్య చేసుకున్నాడని సెంట్రల్ బెంగళూరు డిప్యూటీ కమిషనర్(డీసీపీ) శేఖర్ హెచ్ టెక్కన్నవర్ తెలిపారు. అంతకుముందు రోజు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఒడిశాలో నిందితుడి ఉనికిని గుర్తించిన్నట్టుగా, పోలీసులకు సమాచారం ఉందని వెల్లడించారు. అతనిని పట్టుకోవడానికి అనేక బృందాలను పంపించామని చెప్పారు.
ఈ హత్య కేసులను చాలా సీరియస్‌గా తీసుకున్నామని అని పరమేశ్వర విలేకరులతో అన్నారు. ప్రతాప్ రాయ్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారని, ఒడిశాలోని పలు ప్రాంతాలకు పారిపోయిన అతని కదలికలను చురుగ్గా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
అయితే అంతకుముందు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి పరమేశ్వర ధృవీకరించారు, అయితే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా ప్రతాప్ రాయ్ ప్రాథమిక నిందితుడిగా తేలింది. బాధితురాలి నుంచి దూరంగా ఉంటున్న భర్త కూడా సమీపంలో నివసించే మహాలక్ష్మికి తెలిసిన వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేశాడు.
మహాలక్ష్మిని హత్య చేసిన ముక్తిరాజన్ ప్రతాప్ రాయ్ స్వగ్రామానికి వెళ్లాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. చెట్టుకు ఉరివేసుకుని శవమై కనిపించాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మహాలక్ష్మి మృతికి ముందు విషయ ప్రయోగం జరిగిందో లేదో అని రిపోర్ట్ రావాల్సి ఉంది. అంతేకాదు ఫ్రిజ్ మీద ఉన్న వేలి ముద్రలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ప్రతాప్ రాయ్‌తో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలియాలి.
మహాలక్ష్మి హత్య, దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 2022లో దిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ కేసును పోలి ఉంది. అక్కడ బాధితురాలిని కూడా ముక్కలు చేసి ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాడు ఓ వ్యక్తి.