బెంగళూరులో మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిజ్‌‌‌లో పెట్టిన నిందితుడిని గుర్తించిన పోలీసులు-bengaluru fridge horror mahalakshmi murder case prime suspect identified hiding in west bengal search on ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  బెంగళూరులో మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిజ్‌‌‌లో పెట్టిన నిందితుడిని గుర్తించిన పోలీసులు

బెంగళూరులో మహిళను 50 ముక్కలు చేసి ఫ్రిజ్‌‌‌లో పెట్టిన నిందితుడిని గుర్తించిన పోలీసులు

Anand Sai HT Telugu
Sep 23, 2024 02:40 PM IST

Bengaluru Fridge Horror : బెంగళూరులో దారుణం జరిగింది. ఓ మహిళను 50 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు ఓ వ్యక్తి. అయితే తాజాగా నిందితుడిని గుర్తించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ కేసుపై మహిళా కమిషన్ కూడా సీరియస్‌గా ఉంది.

ఘటన స్థలంలో పోలీసులు, స్థానికులు
ఘటన స్థలంలో పోలీసులు, స్థానికులు

బెంగళూరులోని ఒక గదిలో రిఫ్రిజిరేటర్‌లో 29 ఏళ్ల మహిళను నరికి ముక్కలుగా చేసి పెట్టినట్టుగా గుర్తించారు. తాజాగా ప్రధాన నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు ధృవీకరించారు. 50కి పైగా మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌‌లో దాచి పెట్టారు. ఇది దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసుతో పోలి ఉంది.

సోమవారం మీడియాతో బెంగళూరు పోలీస్ కమిషనర్ బి.దయానంద మాట్లాడారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని తెలిపారు. అతడు పశ్చిమ బెంగాల్‌ ఉన్నట్టుగా తెలిసిందని ప్రకటించారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, మరింత సమాచారం ఇవ్వలేమని చెప్పారు.

బాధితురాలు మహాలక్ష్మి మల్లేశ్వరంలోని ఓ మాల్‌లో పనిచేస్తుంది. తన భర్తకు దూరంగా జీవిస్తున్నట్లు సమాచారం. మృతదేహాన్ని గుర్తించడానికి 4-5 రోజుల ముందు నేరం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కూడా సంఘటనా స్థలానికి వచ్చాడు.

ఆదివారం తెల్లవారుజామున ఆమె తల్లి, సోదరితో సహా బాధితురాలి కుటుంబం మృతదేహాన్ని కనుగొంది. ఈ షాకింగ్ వీడియో బయటపడింది. 44 సెకన్ల క్లిప్‌లో గదిలోకి వారు ప్రవేశించడం కనిపించింది. ఫ్రిజ్‌ను తెరిచి చూడగా మహాలక్ష్మిని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉంది. ఈ విషయం గమనించగానే కుటుంబ సభ్యులు షాక్‌కు గురై ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే సీనియర్ పోలీసు అధికారులు, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అదనపు పోలీసు కమిషనర్(వెస్ట్ జోన్) ఎన్. సతీష్ కుమార్ మాట్లాడుతూ.. 'మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచినట్టుగా గుర్తించాం. ఇది 4-5 రోజుల క్రితం చేసినట్లు తెలుస్తోంది. బాధితురాలు తన భర్తతో విడిగా జీవిస్తోంది.' అని అధికారి తెలిపారు..

జాతీయ మహిళా కమిషన్(NCW) ఈ విషయంపై స్పందించింది. 'బెంగళూరులో మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన విషయం తెలిసింది. ప్రమేయం ఉన్న వారందరినీ త్వరగా అరెస్టు చేయాలి. సమగ్రమైన విచారణ చేయాలి.' అని కమిషన్ పేర్కొంది.

అనుమానితుడు పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడని భావిస్తున్నామని, ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమాచారం, ఆధారాలను సేకరించారని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. బెంగళూరులో మహిళల భద్రత కోసం ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసిందని చెప్పారు.

బెంగళూరులో జరిగిన ఈ భయంకరమైన ఘటన 2022లో దిల్లీలో శ్రద్ధా వాకర్ హత్యను పోలి ఉంది. దిల్లీలో 28 ఏళ్ల అఫ్తాబ్ పూనావల్లా.. వాకర్‌ను గొంతుకోసి చంపేశాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టాడు. తర్వాత వాటిని పారవేశాడు. ఈ కేసు అప్పట్లో సంచలనమైంది. ఇప్పుడు బెంగళూరులోనూ ఇలాంటి ఘటనే జరిగింది.