suryapet tragedy: కంటతడి పెట్టించే ఘటన.. కూతురు మృతదేహాన్ని చూసి భోరున ఏడ్చిన తండ్రి-a daughter who lost her life after seeing her father being beaten in front of her in suryapet district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suryapet Tragedy: కంటతడి పెట్టించే ఘటన.. కూతురు మృతదేహాన్ని చూసి భోరున ఏడ్చిన తండ్రి

suryapet tragedy: కంటతడి పెట్టించే ఘటన.. కూతురు మృతదేహాన్ని చూసి భోరున ఏడ్చిన తండ్రి

suryapet tragedy: సూర్యాపేట జిల్లాలో విషాదం జరిగింది. తన కళ్ల ముందే తన తండ్రిని కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన కూతురు ప్రాణాలు విడిచింది. గాయాలతో ఉన్న ఆ తండ్రి కూతురు మృతదేహంపై పడి రోధించడం కంటతడి పెట్టిస్తోంది.

కూతురు మృతదేహం వద్ద రోధిస్తున్న తండ్రి సోమయ్య

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డీకొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్యకు.. అదే గ్రామానికి చెందిన కడారి సైదులు, కడారి సోమయ్య, కాసం కళింగంతో భూ తగాదాలున్నాయి. గురువారం బోనాల పండుగ రోజు రాత్రి 10 గంటలకు సోమయ్య ఇంటికొచ్చి సైదులు, సోమయ్య, కళింగం కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సోమయ్య కాలు విరిగడంతో పాటు తలకు గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన సోమయ్య భార్య తలకూ గాయాలయ్యాయి.

మా నాన్నను వదలండి..

ఈ దాడి జరుగుతుంటే చూస్తున్న కూతురు పావని(14).. మా నాన్నను వదలండి.. అంటూ బతిమిలాడింది. అయినా అలానే కొట్టడంతో సృహతప్పి కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెళ్లిచూడగా అప్పటికే చనిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమయ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఆఖరి చూపు కోసం..

చికిత్స అనంతరం కూతురును ఆఖరి చూపు చూడటానికి సోమయ్య వచ్చారు. కూతురు మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఒక ఆడబిడ్డ తండ్రిగా ఎంతో చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఈ ఘటన మరో ఉదాహరణ అని పోస్ట్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.