Boy Kidnap: హనుమకొండలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్, 20 నిమిషాల్లో కేసును ఛేదించిన పోలీసులు
Boy Kidnap: హనుమకొండలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. పోలీసులు వేగంగా స్పందించడంతో 20 నిమిషాల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.
Boy Kidnap: హనుమకొండ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన మంగళవారం కలకలం రేపింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిని ఓ రైల్వే ఉద్యోగి ఎవరికీ చెప్పకుండా ఎత్తుకెళ్లగా, బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు 20 నిమిషాల్లోనే కేసును ఛేదించారు. బాలుడిని దుండగుడి నుంచి కాపాడి, సురక్షితంగా కుటుంబ సభ్యులను అందించారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబా బాద్ జిల్లా ఉత్తర తండాకు చెందిన బోడ సురేష్ ప్రియాంక దంపతుల ఐదేళ్ల కొడుకు బిట్టు కొద్దిరోజులుగా హనుమకొండ సప్తగిరి కాలనీలోని అమ్మమ్మ వినోద వాళ్లింట్లో ఉంటున్నాడు. కాగా రోజువారీలాగానే బిట్టు ఆరు బయట ఆడుకుంటుండగా, కాజీపేటలో రైల్వే ఉద్యోగి పని చేస్తూ.. పక్కనే ఉన్న పోలీస్ కాలనీలో ఉంటున్న కర్నిలియస్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
తన బైక్ పై బిట్టును ఎక్కించుకుని బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి కిడ్నాప్ చేశాడు. దీంతో కొద్దిసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు బిట్టు కోసం వెతికారు. కాలనీలో తమకు తెలిసి వాళ్లింట్లో కూడా చూశారు. కానీ ఎక్కడా కనిపించకపోవడంతో పక్క కాలనీల్లోనూ ఆరా తీశారు. అయినా ఫలితం లేకపోవడంతో అమ్మమ్మ వినోద, తమ బంధువులకు సమాచారం అందించింది. వారు వచ్చి వెతికినా బాలుడి ఆచూకీ దొరక్కపోవడంతో అందరూ కంగారు పడ్డారు.
డయల్ 100 కు కాల్.. 20 నిమిషాల్లో ట్రేసౌట్
ఎక్కడ వెతికినా బిట్టు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. దిక్కుతోచని స్థితి ఉదయం 9.54 గంటల సమయంలో డయల్ 100కు కాల్ చేశారు. అక్కడ నుంచి నేరుగా కాకతీయ యూనివర్సిటీ సీఐ సంజీవ్‌కు డయల్ 100 ఫిర్యాదు అందగా, ఆయన వెంటనే అప్రమత్తం అయ్యారు.
బాలుడి కిడ్నాప్ ఘటనను సీరియస్ గా తీసుకుని, వెంటనే తన వెహికిల్ లో ఘటనా స్థలానికి ప్రయాణమయ్యారు. వెళ్తున్న క్రమంలోనే మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు స్పెషల్ గా ఏర్పాటు చేసిన మూడు టీమ్ లు ఎంక్వైరీ ప్రారంభించగా, సీఐ నేరుగా సప్తగిరి కాలనీకి వెళ్లి విచారణ చేపట్టారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు నుంచి వివరాలు సేకరించారు.
వారు ఇచ్చిన సమాచారంతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అక్కడ లభించిన క్లూస్ ఆధారంగా నిందితుడు పోలీస్ కాలనీకి చెందిన కర్నిలియస్ గా గుర్తించారు. ఫిర్యాదు 9.54 గంటలకు అందగా, 10.15 గంటల వరకల్లా నిందితుడిని ట్రేస్ ఔట్ చేశారు. ఈ మేరకు సీఐ సంజీవ్ నేరుగా కర్నిలియస్ ఇంటికి వెళ్తున్న సమయంలో.. నిందితుడు బాలుడు బిట్టుని బైక్ పై ఇంకా వేరే చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్నాడు.
దీంతో గమనించిన సీఐ సంజీవ్ వెంటనే వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. అప్పటికి అతడి నుంచి బాలుడిని కాపాడి వెంటనే బాధిత కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. అనంతరం నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
సీఐ సంజీవ్ పై ప్రశంసల వెల్లువ
డయల్ 100 ఫిర్యాదుకు వెంటనే స్పందించడంతో పాటు కంప్లైంట్ అందిన 20 నిమిషాల్లోనే కేసును ఛేదించడంతో సీఐ సంజీవ్ పై ప్రశంసల జల్లు కురిసింది. బాధిత కుటుంబ సభ్యులు సంజీవ్ స్పందించిన తీరుతో సంతోషం వ్యక్తం చేయగా, విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు కూడా సీఐ సంజీవ్ను అభినందించారు. కాగా అతి కొద్ది సమయంలోనే కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన సీఐ సంజీవ్, సిబ్బందిని కాలనీ వాసులు ప్రశంసించారు.
(రిపోర్టింగ్, ఉమ్మడి వరంగల్ ప్రతినిధి, హెచ్‌టి తెలుగు)