YS Viveka Case : సచివాలయానికి వైఎస్ సునీత - హోం మంత్రితో భేటీ, వివేకా హత్య కేసుపై చర్చ..!-ys sunitha meet home minister anitha at secretariat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Viveka Case : సచివాలయానికి వైఎస్ సునీత - హోం మంత్రితో భేటీ, వివేకా హత్య కేసుపై చర్చ..!

YS Viveka Case : సచివాలయానికి వైఎస్ సునీత - హోం మంత్రితో భేటీ, వివేకా హత్య కేసుపై చర్చ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 07, 2024 01:11 PM IST

YS Sunitha Meet Home Minister Anitha : రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితతో వైఎస్ వివేకా కుమార్తె సునీతా భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసుపై చర్చించారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత
హోం మంత్రి అనితతో వైఎస్ సునీత

తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసుపై న్యాయపోరాటం చేస్తున్నవైఎస్ సునీత ఇవాళ రాష్ట్ర హోం మంత్రి అనితతో భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన ఆమె… వివేకా హత్య కేసుపై చర్చించినట్లు తెలిసింది.

వివేకా హత్య కేసులో చోటు చేసుకున్న పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కూడా తప్పుడు కేసులు పెట్టిన విషయాలను చర్చించారు.  ఈ కేసులో ఉన్న సాక్ష్యులను బెదిరించి కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని… ఈ కేసు విచారణలో రాష్ట్ర పోలీసులు సంపూర్ణ సహకారం ఉండేలా చూడాలని కోరినట్లు తెలిసింది.  సునీత లెవెనత్తిన పలు అంశాలపై హోం మంత్రి అనిత… సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

సీన్ మారుతుందా…?

వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధానంగా అవినాశ్ రెడ్డితో పాటు పలువురిపై వైఎస్ సునీత ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఓ దశలో మొదట్లో సీబీఐ విచారణ కోరిన వైఎస్ జగన్…. ఆ తర్వాత యూటర్న్ ఎందుకు తీసుకున్నారని కూడా ప్రశ్నించారు. ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దాఖలు చేశారు.

 వివేకానందరెడ్డి హత్య కేసులో తనకు న్యాయం చేయాలని 'జస్టిస్ ఫర్ వివేకా' పేరుతో బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోనూ ప్రజంటేషన్ ఇచ్చారు సునీత. వివేకా హత్య రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. అందులో భాగంగానే రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్స్‌ కలుస్తున్నానన్నారు. 

అవినాష్ రెడ్డి లాంటి హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని ఆమె అన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం తన తండ్రి వివేకాను అతి దారుణంగా హత్య చేశారని సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గెలుపు కోసం వివేకా ప్రచారం చేశారని గుర్తుచేశారు. 

హంతకులు అధికారంలో ఉంటే తనకు ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. గత ఐదేళ్లుగా వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్నాయని, ఎన్నో కష్టాలు చూశానన్నారు. తనకు ఇంత చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నానన్నారు. ఈ ఎన్నికల్లో అవినాష్‌ రెడ్డిని గెలవకుండా చేయడమే తన లక్ష్యమని చెప్పారు. 

సునీత చెప్పినట్లే మొన్నటి ఎన్నికల్లో అవినాశ్ రెడ్డిపై పోటీకి దిగిన తన సోదరి వైెస్ షర్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అవినాశ్ రెడ్డిని ఓడించాలని ప్రజలను కోరుతూ వచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి కూడా సూటిగానే ప్రశ్నలు సంధించారు.

ఇక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. కేవలం 11 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో వైఎస్ వివేకా కేసులో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. నేరుగా సచివాలయానికి వచ్చిన సునీత.. హోం మంత్రితో చర్చించారు. ఈ క్రమంలో… రాష్ట్ర పోలీసు శాఖ ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా..? కేసును విచారిస్తున్న సీబీఐకి కొత్తగా ఏమైనా సమాచారం ఇస్తుందా..? అనేది చూడాలి…!