Hyderabad : తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?-ar constable commits suicide by firing a gun in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?

Hyderabad : తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?

Basani Shiva Kumar HT Telugu
Sep 28, 2024 10:25 AM IST

Hyderabad : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో విషాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

కానిస్టేబుల్ ఆత్మహత్య
కానిస్టేబుల్ ఆత్మహత్య

తుపాకితో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఏఆర్ కానిస్టేబుల్ దూసరి బాలకృష్ణ గౌడ్ (28) తన గన్‌తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున బాత్రూం గదిలోకి వెళ్లి తలుపులు మూసివేసి.. తన ఆయుధంతో కాల్చుకున్నారు.

మృతదేహాన్ని ఆదిభట్ల పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగినప్పుడు.. మృతుడి తోపాటు ముగ్గురు సహ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల గ్రామం. బాలకృష్ణ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఆన్‌లైన్ గేమ్స్ బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

షాద్‌నగర్‌లో మహిళ హత్య..

షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో గుర్తు తెలియని మహిళ హత్యకు గురైన సంఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 15వ వార్డు కాలనీవాసులు శనివారం తెల్లవారుజామున వాకింగ్ వెళ్లారు. ఆ సమయంలో కాలనీలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎక్కడో చంపేసి ఇక్కడ పడేశారా..

కోర్టు పక్కన కొంత దూరంలో ఇళ్ల మధ్యలో ఒక ప్లాస్టిక్ కవర్‌లో బ్లాంకెట్‌లో చుట్టి.. శవాన్ని ఇక్కడ పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏసీపీ రంగస్వామి మీడియాతో మాట్లాడుతూ.. 35 నుండి 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళను.. ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన వర్ష (19) రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో బీటెక్​ సీఎస్​ఈ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడే గల్స్ హాస్టల్‌లో ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.