Walking types: నడకలో 7 రకాలున్నాయి.. ఇవి మొదలెడితే వాకింగ్ అంటే బోరే కొట్టదిక
Walking types: రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక లాభాలున్నాయి. అయితే వాకింగ్ రోజూ చేయడం బోర్ కొడితే ఈ 10 రకాల వాకింగులు చేసి చూడండి.
ఒక దారిని ఎంచుకోవడం.. ఇంట్లో మొదలు పెట్టి రోజూ నడిచే దారినే నడవటం, అయిపోయాక వెనుతిరిగి ఇంటికి రావడం.. వాకింగ్ అంటే ఇంతే. కానీ దానివల్ల కొన్ని రోజులకు వాకింగ్ అంటే బోర్ కొట్టేస్తుంది. అలా బోర్ కొట్టకుండా ఉండాలంటే మీ వాకింగ్‌ను ఆసక్తికరంగా మార్చుకోవచ్చు తెలుసా? దానికోసం ఏమీ చేయక్కర్లేదు. కేవలం మీరు కాస్త విభిన్నంగా నడవాలంతే. వీటివల్ల బరువు కూడా తొందరగా తగ్గుతారు. అదెలాగో చూడండి.
వాకింగ్ రకాలు:
1. పవర్ వాకింగ్:
నిదానంగా నడవకుండా మధ్యలో కాసేపు స్పీడ్ వాకింగ్ చేయండి. నిదానంగా నడవటం కన్నా దీనివల్ల ఎక్కువ కండరాలు పనిచేస్తాయి. గుండె రేటు పెరుగుతుంది. కేలరీలు ఎక్కువగా కరుగుతాయి. బరువు తగ్గుతారు. రక్తపోటు తగ్గుతుంది. క్రమంగా చేయడం వల్ల కీళ్ల నొప్పులూ తగ్గుతాయి. మీకు వాకింగ్ కూడా బోర్ కొట్టదు.
2. 8 ఆకారంలో నడక:
ఊరికే రోడ్డు పక్కన, పార్కులో నేరుగా నడుచుకుంటూ వెళ్తే పక్కా బోర్ కొట్టేస్తుంది. అలా అనిపించకుండా రోజూ కాసేపు 8 ఆకారంలో నడవండి. ఈ ఆకారంలో నడిచినప్పుడు కండరాల మీద ఒత్తిడి వేరుగా పడుతుంది. కీళ్లలో సాగేగుణం పెరుగుతుంది. కండరాలు బలపడతాయి. దీన్నే సిద్ధ వాకింగ్ లేదా ఇన్ఫినిటీ వాకింగ్ అనీ అంటారు.
3. బ్రిస్క్ వాకింగ్:
ఇది పవర్ వాకింగ్ కన్నా నెమ్మదిగా, మామూలు నడకకన్నా కాస్త వేగంగా నడవటం అనుకోవచ్చు. ఇది కూడా ఎక్కువ కేలరీలు కరిగిస్తుంది. ముఖ్యంగా పొట్ట కొవ్వు కరుగుతుంది. ఇది కాస్త తక్కువ ప్రభావం ఉన్న ఏరోబిక్ వ్యాయామం అనుకోవచ్చు.
4. రివర్స్ వాకింగ్:
వెనక్కు నడవటం వల్ల చాలా లాభాలుంటాయి. ముందుకు నడవడం కన్నా ఇలా నడిస్తే లాభాలు చాలా ఎక్కువ. ఒక విభిన్న కండరాల సమూహం ఇలా నడిచినప్పుడు పనిచేస్తుంది. రివర్స్ వాకింగ్ మంచి కార్డియో వ్యాయామం. బరువు తగ్గడంలోనూ బాగా సాయపడుతుంది. మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లు ఇలా నడవటం వల్ల మోకాళ్లలో ఒత్తిడి తక్కువ పడుతుంది.
5. ఇంటర్వెల్ వాకింగ్:
దాని పేరు చెబుతున్నట్లే మార్చి మార్చి విభిన్నంగా నడవడం అన్నమాట. అంటే ఒక నిమిషం బ్రిస్క్ వాకింగ్ చేస్తే మరో రెండు నిమిషాలు నెమ్మదిగా నడవాలి. తర్వాత మళ్లీ వేగం పెంచాలి. ఇలా చేయడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు. జీవక్రియ రేటు పెరుగుతుంది. కేలరీలు తొందరగా కరుగుతాయి. గుండె ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. చెబుతున్నంత సులభంగా ఇలా నడవటం సాధ్యం కాదు. మధ్య మధ్యలో వేరే వ్యాయామాలు చేసుకుంటూ ఇలా నడవండి.
6. ఏటవాలుగా నడవడం:
మెట్లు ఎక్కడం, ట్రెడ్ మిల్ మీద ఏటవాలుగా నడవటం, కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నడవడం లాంటివాటి వల్ల లాభాలుంటాయి. అంటే నడిచేటప్పుడు ఎత్తులో తేడా రావడం. నడుము కింది భాగాలు దీనివల్ల బాగా పనిచేస్తాయి. కేలరీలు చాలా తొందరగా కరిగిపోతాయి. 5 శాతం ఎక్కువ ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో నడిస్తే 17 శాతం మామూలు నడకతో పోలిస్తే ఎక్కువ కేలరీలు కరిగిపోతాయి. 10 శాతం ఎక్కువ ఏటవాలుంటే 32 శాతం ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.
7. బరువులతో నడవటం:
మీ చేతిల్లో బరువులు పట్టుకుని నడవటం అన్నమాట. వీటివల్ల మంచి వ్యాయామమూ జరుగుతుంది. కేలరీలు చాలా ఎక్కువగా ఖర్చవుతాయి. కండరాలకూ మంచి వ్యాయామం దొరుకుతుంది. కీళ్ల కండరాలు బలపడతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. అయితే జాగ్రత్తలు పాటించే చేయకపోతే గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్