తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Coaching Centre Deaths : ‘కోచింగ్​ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’- సుప్రీం

Delhi coaching centre deaths : ‘కోచింగ్​ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి’- సుప్రీం

Sharath Chitturi HT Telugu

05 August 2024, 13:28 IST

google News
  • Supreme court Delhi coaching centre deaths : దిల్లీ కోచింగ్​ సెంటర్​లో యూపీఎస్సీ విద్యార్థుల మృతి పట్ల సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వం స్పందించాలని పేర్కొంది.

దిల్లీ కోచింగ్​ సెంటర్​ మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
దిల్లీ కోచింగ్​ సెంటర్​ మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. (PTI)

దిల్లీ కోచింగ్​ సెంటర్​ మరణాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దిల్లీ ఓల్డ్ రాజిందర్ నగర్​లోని ఓ కోచింగ్ సెంటర్ బేస్​మెంట్​లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థుల మృతి ఘటనపై సుప్రీంకోర్టు సోమవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు ఈ విషయంపై స్పందించాలని చెబుతూ, ‘కోచింగ్​ సెంటర్లు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి,’ అని వ్యాఖ్యానించింది.

కోచింగ్ సంస్థల్లో నిర్దేశిత భద్రతా ప్రమాణాలను లిస్ట్​ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమస్యలకు అనుగుణంగా ప్రవేశపెట్టిన సమర్థవంతమైన యంత్రాంగాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని స్పష్టం చేసింది.

యూనిఫైడ్ బిల్డింగ్ బై లాస్ 2016 ప్రకారం నిర్దేశించిన భద్రతా నిబంధనల్లోని ఫైర్​ ఎన్​ఓసీ (నిరభ్యంతర పత్రం), ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తప్పనిసరి చేస్తూ 2023 డిసెంబర్​లో దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్​లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​ను విచారించినప్పుడు, "సరైన వెంటిలేషన్, సేఫ్టీ ప్యాసేజ్, ఎయిర్ అండ్ లైట్, ఫైర్ సేఫ్టీ నిబంధనలు, చట్టం నిర్దేశించిన ఇతర అవసరాలు అవసరం," అని పేర్కొంది. దేశ రాజధానిలో ఇటీవల జరిగిన ఘటన అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది.

“ఈ ప్రదేశాలు (కోచింగ్ సెంటర్లు) డెత్ ఛాంబర్లుగా మారాయి. గౌరవప్రదమైన జీవితానికి భద్రతా నిబంధనలు, ప్రాథమిక నిబంధనలను పూర్తిగా పాటించకపోతే కోచింగ్ సంస్థలు ఆన్​లైన్​లో కార్యకలాపాలు నిర్వహించవచ్చు,” అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. కోచింగ్ సెంటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని పేర్కొంది.

ప్రజలకు ఎలాంటి సందేహాలు లేకుండా చూసేందుకు కోచింగ్​ సెంటర్​లో యూపీఎస్సీ అభ్యర్థుల మరణం కేసు దర్యాప్తును నగర పోలీసుల నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేసింది దిల్లీ హైకోర్టు.

జులై 27న జరిగిన దిల్లీ కోచింగ్ సెంటర్ దుర్ఘటనలో మృతులను ఉత్తరప్రదేశ్​కు చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోనీ (25), కేరళకు చెందిన 24 ఏళ్ల నెవిన్ డెల్విన్ గా గుర్తించారు.

కోచింగ్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ..

తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన కోచింగ్ సెంటర్లలో మెరుగైన భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వివిధ కోచింగ్ ఇన్​స్టిట్యూట్​ల వద్ద విద్యార్థులు ఆదివారం కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పలువురు విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి కోచింగ్ సెంటర్ భవనం ఎదుట బైఠాయించి ప్రాణాలు కోల్పోయిన తమ స్నేహితులను గుర్తు చేసుకున్నారు.

దిల్లీ కోచింగ్ ఎడ్యుకేషనల్ సెంటర్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ముసాయిదాను వెంటనే విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం