Delhi coaching centre : విషాదకర కోచింగ్​ సెంటర్​ ఘటన మృతుల్లో తెలంగాణవాసి-who were the 3 upsc students killed in flooding at delhis coaching centre ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Coaching Centre : విషాదకర కోచింగ్​ సెంటర్​ ఘటన మృతుల్లో తెలంగాణవాసి

Delhi coaching centre : విషాదకర కోచింగ్​ సెంటర్​ ఘటన మృతుల్లో తెలంగాణవాసి

Sharath Chitturi HT Telugu

దిల్లీ కోచింగ్​ సెంటర్​లో వరద ఘటనలో ముగ్గురు మరణించారు. వీరిలో ఒకరు తెలంగాణవాసి అని తెలుస్తోంది. బాధితురాలి పేరు తానియా సోనీ.

కోచింగ్​ సెంటర్​లో వరద- ముగ్గురు మృతి

దిల్లీలోని ఓ కోచింగ్​ సెంటర్​లో వరద సృష్టించిన బీభత్సం దేశంలో సంచలనంగా మారింది. రాజేంద్ర నగర్​లోని రావు ఐఏఎస్​ స్టడీ సర్కిల్​లోకి శనివారం రాత్రి వరద నీరు పోటెత్తిన ఘటనలో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వీరి వివరాలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురిలో ఒకరు తెలంగాణవాసి అని తెలుస్తోంది.

కోచింగ్​ సెంటర్​లో వరద ఘటనలో తెలంగాణవాసి మృతి..

దిల్లీలో శనివారం విపరీతమైన వర్షం కురిసింది. రోడ్లు జలమయం అయ్యాయి. కాగా రాజేంద్ర నగర్​లోని కోచింగ్​ సెంటర్​ బేస్​మెంట్​లోకి వరద నీరు చేరింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతులను ఉత్తరప్రదేశ్​లోని అంబేడ్కర్ నగర్​కు చెందిన శ్రేయా యాదవ్, తెలంగాణకు చెందిన తానియా సోనీ, కేరళలోని ఎర్నాకుళానికి చెందిన నివిన్ డాల్విన్​గా గుర్తించారు.

ప్రస్తుతం మృతదేహాలను ఆర్ఎంఎల్ మార్చ్యూరీకి తరలించినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు.

తానియా మృతి పట్ల కిషన్​ రెడ్డి దిగ్భ్రాంతి..

దిల్లీలో రాజేంద్రనగర్​లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా సికింద్రాబాద్‌కు చెందిన తానియా సోని అనే 25 ఏళ్ల యువతి మృతిచెందిన ఘటనపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తానియా సోని తండ్రి శ్రీ విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్​లో పరామర్శించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతికకాయం వీలైనంత త్వరగా కుటుంబసభ్యులకు అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని తెలియజేశారు.

దిల్లీ పోలీసులు, ఇతర అధికారులతో మాట్లాడి.. పెండింగ్​లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్​ని త్వరగా పూర్తిచేయడంలో చొరవ తీసుకోవాలని దిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు.

ఘటనకు సంబంధించిన వివరాలు

శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావు ఐఏఎస్ స్టడీ సెంటర్, కరోల్ బాగ్ ప్రాంతంలో నీరు నిలిచిపోయినట్లు దిల్లీ అగ్నిమాపక శాఖకు ఫోన్ వచ్చిందని, వరద వల్ల బేస్​మెంట్​లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అక్కడకు చేరుకోగానే బేస్​మెంట్​ నిండా నీళ్లు కనిపించాయి. బేస్​మెంట్​లోకి వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో నీటిని బయటకు పంపే ప్రయత్నాలకు తొలుత ఆటంకం కలిగిందని, అయితే రోడ్డు నీరు తగ్గుముఖం పట్టడంతో నీటి మట్టాన్ని 12 అడుగుల నుంచి 8 అడుగులకు తగ్గించి విద్యార్థుల మృతదేహాలను వెలికితీశామని అధికారులు చెప్పారు.

కోచింగ్ సెంటర్​లో సుమారు 30 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 12 నుంచి 14 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించినట్టు, మరికొందరు ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినట్టు అధికారులు వెల్లడించారు.

రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, బేస్​మెంట్​లోకి నీరు ఎలా ప్రవేశించిందో, అక్కడ ఎందుకు క్లాస్ నిర్వహిస్తున్నారో తెలుసుకునేందుకు విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

మరోవైపు కోచింగ్ సెంటర్ యజమాని, కోఆర్డినేటర్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విద్యార్థుల మృతిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

బిల్డింగ్ బైలాస్​ని ఉల్లంఘించి బేస్​మెంట్​లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఎంసీడీ కమిషనర్​ని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు ఎంసీడీకి చెందిన అధికారులెవరైనా బాధ్యులుగా ఉన్నారా? అనే విషయంపై తక్షణమే విచారణ జరుపుతామని ఆమె తెలిపారు. ఏ అధికారి అయినా దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు కోచింగ్​ సెంటర్​లో విద్యార్థుల మృతిపట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. వందలాది మంది ఘటనాస్థలానికి వెళ్లి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.