Coaching Centres : కోచింగ్ సెంటర్లకు నిబంధనలు పట్టవా? ఏడాదికి 70వేల కోట్లపైనే బిజినెస్-private coaching centres do not follow rules and regulations and this business crossed 70000 crore rupees per year ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Coaching Centres : కోచింగ్ సెంటర్లకు నిబంధనలు పట్టవా? ఏడాదికి 70వేల కోట్లపైనే బిజినెస్

Coaching Centres : కోచింగ్ సెంటర్లకు నిబంధనలు పట్టవా? ఏడాదికి 70వేల కోట్లపైనే బిజినెస్

Anand Sai HT Telugu
Jul 29, 2024 06:23 PM IST

Coaching Centres Rules : ఇటీవల దిల్లీలోని ఐఏఐస్ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘటనతో దేశం మెుత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఉన్నతమైన ఉద్యోగం కోసం వచ్చిన అభ్యర్థులు జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఇలా నిబంధనలు పాటించని సెంటర్లు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జీవితంలో గొప్ప ఉద్యోగం సాధించాలని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు అభ్యర్థులు. ఇదే అదునుగా భావించి.. డబ్బులు సొమ్ము చేసుకునేందుకు కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మెయిన్ సెంటర్లలో గల్లీకి పది పదిహేను ఉన్నాయి. ఇక హైదరాబాద్ అమీర్‌పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లాంటి ప్రదేశాల్లో అయితే వందల కొద్ది కోచింగ్ సెంటర్లు వెలిశాయి. పగలు రాత్రి తేడా లేకుండా చదివే అభ్యర్థులు.. కోచింగ్ సెంటర్లు నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల దిల్లీలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.

శ్రేయా యాదవ్, నివిన్ డాల్విన్, తాన్యా సోనీ.. యూపీఎస్సీ కోచింగ్ కోసం వచ్చి దిల్లీలోని రావ్‌ ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌‌లోని బేస్‌మెంట్‌లో వరదల కారణంగా తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. దేశమంతా ఈ ఘటన గురించి మాట్లాడుకుంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి.

వేల కోట్ల ఆదాయం

నివేదికల ప్రకారం.. దేశంలో 68వేలకు పైగా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఈ మార్కెట్ దందా ఆదాయం ఏడాదికి 70 వేల కోట్లపైనే. నాలుగైదు ఏళ్లలో లక్ష కోట్లు దాటనుంది. ఒక్క హైదరాబాద్ అమీర్‌పేటలాంటి మెయిన్ సెంటర్లలోనే వేల కోట్ల మార్కెట్ జరుగుతుంది. వందశాతం ఉద్యోగం అని డబ్బులు దండుకోవడం.. కోచింగ్ సమయం అయిపోయాక పట్టించుకోకుండా ఉండటం. చాలా కోచింగ్ సెంటర్లు ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి.

నిజానికి విద్యా మంత్రిత్వ శాఖ 2024 జనవరిలో కోచింగ్ సెంటర్లపై కొన్ని నమూనా మార్గదర్శకాలను రూపొందించింది. కానీ వాటి అమలుపై మాత్ర పర్యవేక్షణ లేదు. దిల్లీ ఘటనను మెల్లమెల్లగా రాజకీయం చేస్తున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లను సీలు చేసి మూసేస్తే ఫలితం లేదు. కోచింగ్ సెంటర్లకు ఉండాల్సిన నిబంధనలపై గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది.

ఇలాంటి ఘటనలు జరిగినా.. మళ్లీ కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తాయి. అయితే అవి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్క ఘటన బయటకు రావడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి.. తిరిగి.. ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు కూడా చాలా మందే ఉన్నారు. చాలా సెంటర్లు ఎక్కువ మంది విద్యార్థులు వచ్చేందుకు, ఎక్కువ డబ్బు కోసం ఉద్యోగ అభ్యర్థులపై ఒత్తిడి తెస్తున్నాయి.

మార్గదర్శకాలు కాగితం వరకే

భారతదేశంలోని ప్రైవేట్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జనవరి 2024లో మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు అనుసరించాల్సిన నమూనా మార్గదర్శకాలుగా ఉండాల్సి ఉంది.. కానీ ఇవి అమలు చేస్తున్నారా? ఏదైనా మానిటరింగ్ సిస్టమ్ అమలులో ఉందా? అనేది పెద్ద ప్రశ్న. నిజానికి మార్గదర్శకాలు మాత్రమే వచ్చాయి. వాటిని పట్టించుకునే కోచింగ్ సెంటర్లు లేవు.

నిబంధనలు పట్టించుకోవడం లేదు

మార్గదర్శకాలలో కోచింగ్ సెంటర్ల నమోదు కోసం నిబంధనలను కచ్చితంగా పాటించడం, ఫీజు నియంత్రించడం, భవనం, ఇతర మౌలిక సదుపాయాల నిబంధనలను పాటించడం, కౌన్సెలింగ్ తప్పనిసరి చేయడం, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ నియమాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలలో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రవేశానికి వయస్సు ప్రమాణాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కాగితాల మీదకే పరిమతమయ్యాయి. ప్రభుత్వం మంచి ఆలోచనతో తీసుకొచ్చిన నిబంధనలు పాటించేవారు మాత్రం కరువయ్యారు. కోచింగ్ సెంటర్‌లు నమోదు చేసుకున్న వారి సంఖ్యకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలను అందించాలి.

కానీ పరిస్థితి వేరేలాగా ఉంది. కనీసం సరైన వెంటిలేషన్ కూడా లేని చిన్న గదులలో కోచింగ్ తరగతులు నడుస్తున్నాయి. కోచింగ్ సెంటర్‌లు ఫైర్ సేఫ్టీ కోడ్‌లు, బిల్డింగ్ సేఫ్టీ కోడ్‌లకు కట్టుబడి ఉండాలని, సంబంధిత అధికారుల నుండి సంబంధిత సర్టిఫికేట్‌లను పొందాలని కూడా మార్గదర్శకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ అనేక కోచింగ్ సెంటర్లు ఈ నిబంధనలు పాటించడంలో విఫలమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ..

అధికారం ఉన్న వ్యక్తులు, భారతదేశంలోని ప్రముఖ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను కలిగి ఉన్న వారి మధ్య ఉన్న అనుబంధం కూడా ఇలాంటి రూల్స్ పట్టించుకోకపోవడానికి ఓ కారణమై ఉండవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లోని కొన్ని కోచింగ్ సెంటర్లలో అయితే సరైన వెంటిలేషన్ కూడా ఉండదు. ఏపీలోనూ అనేక కోచింగ్ సెంటర్లు డబ్బు దండుకోవడానికి మాత్రమే చూస్తున్నాయి. నిబంధలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంపై సీరియస్‌ యాక్షన్ తీసుకోవాలి. కోచింగ్ సెంటర్లపై నియంత్రణకు కఠినమైన మార్గదర్శకాలు ఇవ్వాలి. కచ్చితంగా పాటించేలా ఏర్పాట్లు చేయాలి. పర్యవేక్షణ కోసం అధికారులను నియమించాలి. ఫీజు నుంచి మౌలిక సదుపాయల వరకూ కఠిన నిబంధలను తీసుకురావాలి. అప్పుడే అభ్యర్థులు మంచి వాతావరణంలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఘటనలు కూడా జరగకుండా ఉంటాయి.

Whats_app_banner