Cyclone Sitrang : తీరం దాటిన ‘సిత్రంగ్’.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!
25 October 2022, 7:15 IST
- Cyclone Sitrang landfall : బంగ్లాదేశ్‌లో సిత్రంగ్ తుపాను తీరం దాటింది. ఇప్పటికే ఏడుగురి ప్రాణాలు తీసింది.
తీరం దాటిన ‘సిత్రంగ్’.. తుపాను ధాటికి ఏడుగురు మృతి!
Cyclone Sitrang landfall : తీరం దాటుతూనే.. సిత్రంగ్ తుపాను బంగ్లాదేశ్‌లో తీవ్ర అలజడులు సృష్టించింది. తుపాను ధాటికి ఇప్పటికే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. తుపాను నేపథ్యంలో వేలాది మంది ప్రజలు, పశువులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఈ తుపానుకు సిత్రంగ్ అని పేరు పెట్టింది థాయ్‌లాండ్. బంగ్లాదేశ్‌లోని టింకోనా ద్వీపం- సంద్వీప్ మధ్యలో సోమవారం అర్ధరాత్రి- మంగళవారం తెల్లవారుజామున సమయంలో సిత్రంగ్ తుపాను తీరం దాటినట్టు సమాచారం.
Cyclone Sitrang live updates : తుపాను తీరాన్ని ధాటిన అనంతరం భారీ వర్షాలు.. బంగ్లాదేశ్‌ను గడగడలాడించాయి. వేగంగా వీస్తున్న గాలులు భయపెట్టాయి. మొత్తం మీద 28,155మంది ప్రజలు, 2,736 పశువులను.. కాక్స్ బజార్ తీర ప్రాంతం నుంచి 576 సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అవసరమైతే ఉపయోగించుకునేందుకు.. సమీపంలోని స్కూళ్లు, కళాశాలలను కూడా అధికారులు సిద్ధం చేశారు.
తుపాను నేపథ్యంలో ఓ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. సాయం కోసం ప్రజలు కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
సిత్రంగ్ తుపానును ఎదుర్కొనేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమైంది. ఎమర్జెన్సీ కోసం 104 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. 323 టన్నుల బియ్యం, 400 కార్టన్ల బిస్కెట్లు, 1,198 ప్యాకేజీలు డ్రై ఫుడ్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలను సిద్ధం చేసింది.
భారత్‌లో భారీ వర్షాలు..
Cyclone Sitrang latest news India : బంగ్లాదేశ్‌లో సిత్రంగ్ తుపాను తీరం దాటడంతో.. పశ్చిమ్ బెంగాల్‌తో పాటు ఈశాన్య భారతంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విద్యాసంస్థలకు ఇప్పటికే మంగళవారం సెలవును ప్రకటించారు.
ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.
సిత్రంగ్ తుపాను నేపథ్యంలో అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్న మేఘాలయలో తుపాను ప్రభావం కాస్త ఎక్కువగా ఉండొచ్చు. ఫలితంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.