తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Sitrang: మత్స్యకారులను వెనక్కి పిలిచిన కోస్ట్ గార్డ్

Cyclone Sitrang: మత్స్యకారులను వెనక్కి పిలిచిన కోస్ట్ గార్డ్

HT Telugu Desk HT Telugu

24 October 2022, 16:16 IST

google News
    • Cyclone Sitrang alert: మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, సముద్రం నుంచి వెనక్కి రావాలని కోస్ట్ గార్డ్ అలెర్ట్ చేసింది.
కోల్‌కతాలో గంగా నది ఒడ్డున బోట్లను పార్కింగ్ చేసిన మత్స్యకారులు
కోల్‌కతాలో గంగా నది ఒడ్డున బోట్లను పార్కింగ్ చేసిన మత్స్యకారులు (PTI)

కోల్‌కతాలో గంగా నది ఒడ్డున బోట్లను పార్కింగ్ చేసిన మత్స్యకారులు

విశాఖపట్నం, అక్టోబర్ 24: సిత్రంగ్ తుపాను భయం కారణంగా మత్స్యకారులు తమ పడవలతో తిరిగి రావాలని భారత తీర రక్షక దళం ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచించింది. మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

‘కోస్ట్‌గార్డ్ ఈస్ట్ రీజియన్ మత్స్యకారుల భద్రతకు కట్టుబడి ఉంది. బంగాళాఖాతంలో సిత్రంగ్ తుపాను తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతున్నందున ఇండియన్ కోస్ట్ గార్డ్ మత్స్యకారుల భద్రత కోసం తన ప్రయత్నాలు చేస్తోంది. అన్ని ఫిషింగ్ బోట్‌లు తిరిగి నౌకాశ్రయానికి పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయి..’ అని డిఫెన్స్ పీఆర్వో ట్వీట్ చేశారు.

ఉత్తర కోస్తా ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపారు.

‘పశ్చిమ బెంగాల్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా త్రిపుర, మేఘాలయ, దక్షిణ అస్సాంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి..’ అని ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ భువనేశ్వర్‌లో చెప్పారు.

'సిత్రంగ్' తుపాను గత ఆరు గంటల నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఆయన తెలిపారు.

‘వచ్చే 12 గంటలలో తుపాను తీవ్ర తుపానుగా మారుతుంది. అది ముందుకు కదులుతుంది. రేపు తెల్లవారుజామున టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశం ఉంది’ అని ఆయన చెప్పారు.

తుపాను 'సిత్రంగ్' సోమవారం ఉదయం సాగర్ ద్వీపానికి దక్షిణంగా 520 కి.మీ., బంగ్లాదేశ్‌లోని బారిసాల్‌కు దక్షిణ-నైరుతి దిశలో 670 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

‘ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి రాబోయే 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారుతుంది. టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బంగ్లాదేశ్ తీరాన్ని దాటుతుంది..’ అని భారత వాతావరణ విభాగం తెలిపింది.

సిత్రంగ్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాల్లో తుపాను ప్రభావం ఉంటుందని హెచ్చరిక జారీ చేయడంతో పాటు అక్టోబర్ 24-25 మధ్య ఉత్తర బంగాళాఖాతంలో ఆఫ్‌షోర్ కార్యకలాపాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

‘పశ్చిమ మధ్య బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుపాను తీవ్రంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు 25 అక్టోబర్ 2022 వరకు సముద్రంలోకి వెళ్లవద్దు అని ఐఎండీ ప్రకటన తెలిపింది. గడ్డితో కూడిన గుడిసెలు దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు సూచించారు.

కచ్చా రోడ్లు, పక్కా రోడ్లు ధ్వంసం అవడంతో పాటు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సోమవారం ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరుకుని క్రమంగా 60-80 కిలోమీటర్ల వేగానికి పెరిగాయని, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల నది ఒడ్డును రక్షించడానికి పాలన యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటోంది. నది ఒడ్డున ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా ఏర్పాట్లు చేస్తోంది. దక్షిణ 24 పరగణాల్లోని చునోఖలి బసంతి ప్రాంతంలో తుపానుకు ముందే నది కట్ట మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం