Air India flight: అమెరికా వెళ్తున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు; ఇటీవల విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు
15 October 2024, 19:53 IST
- Air India flight: అమెరికాలోని షికాగో వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉందన్న సమాచారం నేపథ్యంలో, ఆ విమానాన్ని అత్యవసరంగా కెనడాకు దారి మళ్లించి, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ రావడంతో ఆ విమానాన్ని కెనడాకు దారి మళ్లించినట్లు ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది.
The Air India flight landed at the Iqaluit Airport in Canada. (Bloomberg)
USA flight: బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ నుంచి షికాగో వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని కెనడాలోని విమానాశ్రయానికి దారి మళ్లించారు. ఈ నెల 15న ఢిల్లీ నుంచి బయలుదేరిన ఈ విమానానికి ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో కెనడాకు మళ్లించి ఇక్లూయిట్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ప్రయాణికుల లగేజ్ చెకింగ్
2024 అక్టోబర్ 15న ఢిల్లీ నుంచి షికాగోకు బయలుదేరిన ఏఐ127 విమానంలో బాంబు ఉందన్న సమాచారం వచ్చిందని, దాంతో ముందుజాగ్రత్త చర్యగా కెనడాలోని ఇక్యులూయిట్ విమానాశ్రయంలో ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిందని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. నిర్దేశిత భద్రతా ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని, ప్రయాణికులను, ప్రయాణికుల లగేజీని తిరిగి క్షుణ్నంగా పరీక్షిస్తున్నారు. ‘‘ప్రయాణీకులకు వారి ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు సహాయం చేయడానికి ఎయిర్ ఇండియా (airindia) విమానాశ్రయంలో ఏజెన్సీలను యాక్టివేట్ చేసింది’’ అని ఎయిర్లైన్స్ తెలిపింది. భద్రతా ప్రోటోకాల్స్ ప్రకారం ప్రయాణికులందరినీ విమానయాన సంస్థలు తిరిగి స్క్రీనింగ్ చేస్తున్నాయని ఎయిరిండియా తెలిపింది.
విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు
గత కొన్ని రోజులుగా పలు విమానాలకు వరుసగా నకిలీ బాంబు బెదిరింపులు వస్తుండటంతో విమాన ప్రయాణాల్లో భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. బాంబు బెదిరింపు కాల్ రావడంతో సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా (air india) విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్స్ ను అనుసరించి, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. ఎయిరిండియాతో పాటు ఇతర స్థానిక విమానయాన సంస్థలు ఇటీవలి రోజుల్లో అనేక బెదిరింపులకు గురవుతున్నాయి.
ఫేక్ అయినా ప్రొటోకాల్ తప్పదు..
బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ అన్నీ ఫేక్ అని తేలినప్పటికీ బాధ్యతాయుతమైన ఎయిర్ లైన్స్ ఆపరేటర్ గా అన్ని బెదిరింపులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా చింతిస్తున్నామని ఎయిరిండియా తెలిపింది. ఈ నకిలీ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న వారిని గుర్తించడానికి ఏజెన్సీలకు అన్ని విధాలా సహకరిస్తున్నామని ఎయిరిండియా తన ప్రకటనలో తెలిపింది. విమానయాన సంస్థకు జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి బాధ్యులపై చట్టపరమైన చర్యలను కూడా పరిశీలిస్తామని తెలిపింది.