Girls drink beer: స్కూల్ లో అమ్మాయిల ‘బీర్ పార్టీ’.. వీడియో వైరల్; విచారణకు ప్రభుత్వ ఆదేశం
10 September 2024, 17:55 IST
- Girls drink beer: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు బీర్ లు తాగు తూ పార్టీ చేసుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. దాంతో, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ అమ్మాయిల బీర్ పార్టీ ఘటన చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.
స్కూల్ లో అమ్మాయిల ‘బీర్ పార్టీ’.. వీడియో వైరల్
Girls drink beer: చత్తీస్ గఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులు బీరు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిలాస్ పూర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈ విద్యార్థినులు బీర్ తాగుతున్న ఘటన జరిగిందని, దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలిపారు.
బిలాస్ పూర్ జిల్లాలో
బిలాస్ పూర్ జిల్లాలోని మస్తూరి ప్రాంతంలోని భట్చౌరా గ్రామంలో ఉన్న ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ లో విద్యార్థినులు బీర్ లతో పార్టీ చేసుకున్నారు. వారు బీర్లు, కూల్ డ్రింక్స్ తాగుతున్న వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఈ ఘటన జూలై 29న జరిగినట్లు గుర్తించారు. ఆ రోజు కొందరు అమ్మాయిలు తమ క్లాస్ మేట్ బర్త్ డేను క్లాస్ రూమ్ లోనే సెలబ్రేట్ చేసుకున్నారని, ఆ పార్టీ సందర్భంగా వారు బీర్ తాగారని పోలీసులు తెలిపారు. అనంతరం ఓ విద్యార్థిని ఆ వీడియోలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పాఠశాల ఆవరణలో బాలికలు బీర్, శీతల పానీయాలు తాగుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయని బిలాస్ పూర్ జిల్లా విద్యాధికారి (DEO) టీఆర్ సాహు తెలిపారు.
వీడియో వైరల్
ఈ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో వేలాది వ్యూస్ వచ్చాయి. పాఠశాల ఆవరణలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై నెటిజన్లు పాఠశాల అధికారులు, ఉపాధ్యాయులపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, ఈ బృందం సోమవారం సంబంధిత విద్యార్థులు, ఉపాధ్యాయుల వాంగ్మూలాలను నమోదు చేసిందని బిలాస్ పూర్ జిల్లా విద్యాధికారి (DEO) టీఆర్ సాహు తెలిపారు.
బాటిల్స్ మాత్రమే పట్టుకున్నాం..
అయితే, ఆ వీడియోలో ఉన్న విద్యార్థినులు ఈ ఘటనపై స్పందిస్తూ, తాము సరదా కోసం ఖాళీ బీరు బాటిళ్లను కెమెరాకు చూపిస్తున్నామని, అంతేకాని పాఠశాలలో మద్యం సేవించలేదని చెప్పారు. కాగా, పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, టీచర్లపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. అంతేకాకుండా సంబంధిత బాలికల తల్లిదండ్రులకు కూడా నోటీసులు పంపుతామని అధికారులు తెలిపారు. ఈ విషయంలో ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం ఏ విద్యార్థిపైనా చర్యలు తీసుకోలేదు.