Chandrayaan-3 latest updates : ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్-3!
12 August 2023, 8:35 IST
Chandrayaan-3 latest updates : చంద్రయాన్ 3.. చంద్రుడికి చేరువవుతోంది! ఈ మేరకు ఇస్రో ఓ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఇంకా 1,400 కి.మీలే! చందమామకు చేరువలో చంద్రయాన్-3!
Chandrayaan-3 latest updates : చంద్రయాన్-3పై మరో కీలక అప్డట్ ఇచ్చింది ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్). ఈ స్పేస్‌క్రాఫ్ట్.. చంద్రుడికి ఇంకా 1,437 కి.మీల దూరంలో ఉందని వెల్లడించింది. వారం రోజుల్లో ఈ దూరం 100కి.మీలకు చేరుతుందని స్పష్టం చేసింది.
అదిగో జాబిల్లి..
ఆగస్ట్ 1న భూమి కక్ష్యను వీడి.. ఆగస్ట్ 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది చంద్రయాన్-3. అప్పటి నుంచి ఈ స్పేస్‌క్రాఫ్ట్‌కు ఆర్బిట్ రిడక్షన్ మేన్యువర్ చేస్తూ, దూరాన్ని తగ్గిస్తూ వస్తోంది ఇస్రో. తాజాగా.. మరో దఫా రిడక్షన్ మేన్యువర్ను విజయవంతంగా పూర్తి చేసినట్టు వెల్లడించింది. ఇక ఆగస్ట్ 14, 15 తేదీల్లో మరో రెండుసార్లు ఈ ప్రాసెస్‌ను పూర్తిచేసి.. చంద్రుడికి, చంద్రయాన్-3కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించనున్నట్టు స్పష్టం చేసింది.
Chandrayaan-3 moon landing date : చంద్రయాన్-3 మిషన్‌లో ఇప్పటివరకు అన్ని అనుకున్నట్టుగానే జరుగుతున్నాయని ఇస్రో వెల్లడించింది. అయితే.. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలకమని వెల్లడించింది. ఈ నెల 23న సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:- ‘హలో చందమామ’.. మన చంద్రయాన్-3 తీసిన తొలి ఫొటోలు ఇవే!
చంద్రయాన్-2 కూడా ల్యాండింగ్ సమయంలోనే విఫలమైంది. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు, ఈసారి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నామని వెల్లడించారు. కీలక దశలో సెన్సార్, ఇంజిన్లు విఫలమైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ల్యాండింగ్ విజయవంతమయ్యే విధంగా మోడల్‌ను రూపొందించారు.
Chandrayaan-3 launch date : ఇక చంద్రుడి సౌత్ పోల్‌పై చంద్రయాన్-3కి చెందిన ల్యాండర్ దిగుతుంది. అందులో నుంచి రోవర్ ఒకటి ఉపరితలంపై అడుగు పెడుతుంది. 14 రోజుల పాటు పలు కీలక విషయాలపై పరిశోధనలు చేసి, ఆ డేటాను ఇస్రోకు పంపిస్తుంది.
జులై 14న చంద్రయాన్-3ని లాంచ్ చేసింది ఇస్రో. ఈ మిషన్ సెక్సెస్ అవ్వాలని యావత్ భారత దేశం ప్రార్థనలు చేస్తోంది.
చంద్రయాన్-3కి పోటీగా.. లూనా 25
Luna 25 launch : చంద్రయాన్-3కి పోటీగా లూనా 25ని లాంచ్ చేసింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. రష్యాలోని తూర్పు అముర్ ప్రాంతంలోని లాంచింగ్ సెంటర్ నుంచి.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు లూన్ 25 మూన్ ల్యాండర్‌తో కూడిన సోయుజ్-2.1బీ రాకెట్ నింగిలోకి ఎగిరింది. ఈ లూనా 25, చంద్రయాన్-3లు ఒకే రోజు చంద్రుడిపై అడుగుపెడతాయని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.