Luna 25 launch : చంద్రయాన్-3కి పోటీగా లూనా 25 లాంచ్.. నింగిలోకి రష్యా రాకెట్
Luna 25 launch : చంద్రుడిపై పరిశోధనల కోసం మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రష్యా చేపట్టిన లూనా- 25 మిషన్ లాంచ్ విజయవంతమైంది.
Luna 25 launch Russia : చంద్రయాన్-3కి పోటీగా లూనా 25ని లాంచ్ చేసింది రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ. రష్యాలోని తూర్పు అముర్ ప్రాంతంలోని లాంచింగ్ సెంటర్ నుంచి.. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 7 గంటల 10 నిమిషాలకు లూన్ 25 మూన్ ల్యాండర్‌తో కూడిన సోయుజ్-2.1బీ రాకెట్ నింగిలోకి ఎగిరింది. ఈ లూనా 25, చంద్రయాన్-3లు ఒకే రోజు చంద్రుడిపై అడుగుపెడతాయని తెలుస్తోంది.
50ఏళ్ల తర్వాత..
దాదాపు 50ఏళ్ల తర్వాత చంద్రుడిపై మిషన్ చేపట్టింది రష్యా. చివరిగా 1976లో లూనా-24ను లాంచ్ చేసింది. ఈ మిషన్‌తో చంద్రుడిపై ఉన్న 6.2 ఔన్సుల (170గ్రాములు) మట్టి శాంపిళ్లను భూమికి తీసుకురాగలిగింది.
ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే.. ఈ లూనా-25 మరో ఐదు రోజుల్లో చంద్రుడి దగ్గరికి చేరుకుంటుంది. అక్కడి నుంచి 5-7 రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతుంది. సరైన సమయం చూసుకుని చంద్రుడి సౌత్ పోల్ ప్రాంతంలో దిగుతుంది. సేఫ్ ల్యాండింగ్ తర్వాత.. ఈ మిషన్ ఏడాది కాలం పాటు చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తుంది.
Luna 25 launch date and time : వాస్తవానికి ఈ లూనా-25 దాదాపు రెండేళ్ల పాటు ఆలస్యమైంది. గతేడాది ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇందుకు ప్రధాన కారణం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి ఈ రాకెట్‌కు పైలట్-డీ నేవిగేషన్ కెమెరా అందాల్సి ఉంది. యుద్ధానికి వ్యతిరేకంగా.. రష్యాకి సాయం చేయమని ఈఎస్ఏ తేల్చి చెప్పింది. ఇదే విధంగా పలు ఇతర అంతర్జాతీయ సంస్థలు సైతం ఈ మిషన్‌కు సాయం చేయడం ఆపేశాయి. ఫలితంగా మిషన్ చాలా ఆలస్యమైంది.
రష్యా లాంచ్ చేసిన లూనా-25 బరువు 66 పౌండ్లు. అంటే 30కేజీలు. ఇందులో సర్వీస్ టెలివిజన్ సిస్టెమ్, సాయిల్ ఇంటేక్ డివైజ్‌తో కూడిన లూనార్ మేనిఫ్యులేటర్ కాంప్లెక్స్, న్యూట్రాన్- గామా డిటెక్టర్ (వాటర్ ఐస్‌ని కనుగొనేందుకు), ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, లేజర్ మాస్ స్పెక్ట్రోమీటర్, ఐయాన్ ఎనర్జీ మాస్ ఎనలైజర్, డస్ట్ మానిటర్, సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ కంట్రోల్ యూనిట్ వంటి పరికరాలు ఉన్నాయి.
సౌత్ పోల్‌పై పెరిగిన ఫోకస్..
Chandrayaan 3 latest updates : చందమామ సౌత్ పోల్‌పై ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తల ఫోకస్ పెరిగింది. ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఇటీవలే లాంచ్ చేసిన చంద్రయాన్-3 కూడా సౌత్ పోల్లోనే పరిశోధనలు చేపట్టనుంది. గత నెల 14న లాంచ్ అయిన ఈ చంద్రయాన్-3.. ఈ నెల 23న చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. చంద్రయాన్-3 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరోవైపు.. అర్తెమిస్ ప్రోగ్రామ్ ద్వారా 2020 దశకం చివరి నాటికి చందమామ సౌత్ పోల్‌పై అనేక ప్రాజెక్టులను చేపట్టేందుకు నాసా సైతం సిద్ధమవుతోంది.
సంబంధిత కథనం