సూపర్ టేస్టీ అంటూ కేకులు తింటున్నారా? 12 కేక్ రకాల్లో క్యాన్సర్ కారకాలు
01 October 2024, 18:10 IST
- cancer agents in cakes : ఎలాంటి వేడుక అయినా తియ్య తియ్యని కేక్ తినడం చాలా మందికి అలవాటు. కానీ కేకులు తింటే మాత్రం చాలా సమస్యలు వస్తాయంటున్నారు అధికారులు. తాజాగా బెంగళూరులో 12 రకాల కేకుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా గుర్తించారు.
కేకుల్లో క్యాన్సర్ కారకాలు
మీరు తరచుగా బేకరీ కేక్‌లను తింటున్నారా? కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలోని బేకరీల్లో తయారుచేసే కేక్‌లలో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలను ఉపయోగించడంపై ఆ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రోజుల కిందట గోబీ మంచూరి, కబాబ్స్, పానీ పూరీ వంటి ఫేమస్ వంటకాల్లో క్యాన్సర్ కారక పదార్థాల గురించి హెచ్చరించింది. మళ్లీ ఇప్పుడు కేకుల్లోనూ ఇలాంటివే ఉన్నట్టుగా చెప్పింది.
బెంగళూరులోని పలు బేకరీల కేక్‌లపై నిర్వహించిన పరీక్షల్లో 12 రకాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలింది. కేకుల తయారీలో ఉపయోగించే పదార్థాల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వాటిలో ఉపయోగించే రంగుల గురించి ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా వీటి ద్వారా ముప్పు ఉందని ప్రకటించింది.
కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్ బేకరీలను ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని చెబుతోంది. ఈ కృత్రిమ రంగులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడమే కాకుండా వివిధ శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమని పేర్కొంది.
ఈ విషయం కేక్ అంటే ఇష్టపడేవారికి షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేక్‌లు వంటి ప్రసిద్ధ రకాలు చూసేందుకు ఆకర్షణీయంగా కృత్రిమ రంగులతో తయారు చేస్తారు. ఇవి ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కేకుల్లో కలిపే కృత్రిమ రంగులతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. వీటి గురించి హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం గోబీ మంచూరియన్, కాటన్ మిఠాయి వంటి ప్రసిద్ధ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఫుడ్ కలరింగ్ ఏజెంట్ రోడమైన్-బి వాడకాన్ని నిషేధించింది. రెస్టారెంట్లలో ఈ కెమికల్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ తెలిపారు.