MUDA Scam : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు-ed files money laundering case against karnataka cm siddaramaiah in muda scam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Muda Scam : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు

MUDA Scam : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు

Anand Sai HT Telugu
Sep 30, 2024 08:37 PM IST

MUDA Scam : ముడా కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు రోజురోజుకు కష్టాలు పెరుగుతున్నాయి. ఈ స్కామ్‌తో ముడిపడి ఉన్న సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (HT_PRINT)

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) స్కామ్‌ దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. స్వయంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉన్నట్టుగా వార్తలు రావడంతో ఈ కేసు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ముడా కుంభకోణానికి సంబంధించి మరో విషయం మీద చర్చ నడుస్తోంది.

yearly horoscope entry point

ముడా కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌లో పేర్కొన్నారు.

అయితే కేంద్ర ఏజెన్సీ ఈడీ.. తన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)లో సిద్ధరామయ్యను బుక్ చేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA)లోని సెక్షన్‌లను ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం ఉంది.

ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టి.జె అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అతడితోపాటుగా స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్‌ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. ఆగస్టు 16న ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు.

అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. దీనిపై కోర్టు కీలక తీర్పునిచ్చింది. సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.