Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు
Ponguleti Srinivasa Reddy : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌లోని పొంగులేటి ఫాంహౌస్, ఆయన బంధువులు ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు.. ఆయన సొంత కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్స్, ఇన్‌ఫ్రా కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసం, రాఘవ్ కంపెనీ ఎండీ, డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు 16 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించాయి.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంత్రి పొంగులేటి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఇళ్లల్లో ఢిల్లీ జోనల్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని.. హైదరాబాద్ జోనల్ అధికారులకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది. ఇటీవల నారాయణపేట- కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును దక్కించుకున్న రాఘవ నిర్మాణాలపై కాంగ్రెస్ శ్రేణులు, నేతల్లో చర్చ జరుగుతోంది.
అయితే.. ఎన్నికల ముందు జరిగిన సోదాలకు తాజాగా చేస్తున్న దాడులు కొనసాగింపు అని అధికారులు చెబుతున్నట్టు తెలుస్తోంది. 2024 తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి కంపెనీ కార్యాలయాలు, ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
పొంగులేటి కుమారుడి ఆస్తులు..
హురున్ ఇండియా ప్రకారం.. కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే.. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి రూ.1,300 కోట్ల సంపదతో.. హైదరాబాద్‌కు చెందిన అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. రాఘవ కంపెనీ బాధ్యతలు హర్ష చూసుకుంటున్నట్టు సమాచారం.