Courier fraud: ఇదో రకం సైబర్ క్రైమ్; ‘కొరియర్ ఫ్రాడ్’ లో రూ. 51 లక్షలు పోగొట్టుకున్న మహిళ
25 September 2024, 17:36 IST
- ఓ బహుళజాతి కంపెనీలో ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తున్న బెంగళూరు మహిళ సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.51 లక్షలు పోగొట్టుకున్నారు.
‘కొరియర్ ఫ్రాడ్’ లో రూ. 51 లక్షలు పోగొట్టుకున్న మహిళ
‘‘కొరియర్ లో మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి. డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాల కొనుగోలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మీ ఆధార్ నంబర్ ఉపయోగించినట్లు తెలిసింది’’ అని బెదిరించి సైబర్ క్రిమినల్స్ బెంగళూరులోని ఒక మహిళ నుంచి రూ. 51 లక్షలు దోచుకున్నారు.
డ్రగ్స్ వచ్చాయని చెప్పి..
బెంగళూరులోని ఓ బహుళజాతి కంపెనీలో ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళను ఫెడెక్స్ ప్రతినిధులుగా, ముంబై పోలీసు అధికారులుగా నటిస్తూ బెదిరించిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.51.29 లక్షలు కాజేశారు. సెప్టెంబర్ 17న బాధితురాలికి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. అందులో ఆమె ఆధార్ వివరాలను మాదకద్రవ్యాల స్మగ్లింగ్ ఆపరేషన్ లో ఉపయోగిస్తున్నారని కాల్ చేసిన వ్యక్తి పేర్కొన్నాడు. దాంతో ఆమె భయపడిపోయింది.
10 గంటల పాటు స్కైప్ కాల్..
ఆ తరువాత ఆమెతో 10 గంటల స్కైప్ కాల్ లో ఒంటరిగా మాట్లాడి ఆమెను మరింత భయపెట్టారు. తాము చెప్పినట్లు వినకపోతే, తమకు సహకరించకపోతే అరెస్టు చేస్తామని పదేపదే బెదిరించారు. మాదకద్రవ్యాలతో కూడిన పార్శిల్ ను స్వాధీనం చేసుకున్నామని, దానిపై ఆ మహిళ వివరాలు ఉన్నాయని లా ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్లుగా నటించే నేరగాళ్లు ఆమెకు చెప్పారు. ఆ తర్వాత కాల్ ను మరో నకిలీ ముంబై సైబర్ క్రైమ్ అధికారికి బదిలీ చేశారు. అతడు ఆమెకు సాయం చేస్తానని చెప్పి, ఆమె బ్యాంక్ అకౌంట్ తదితర వివరాలు తీసుకున్నాడు. అనంతరం, ఆమె నుంచి సుమారు రూ. 51 లక్షలు తీసుకున్నారు. ముందుగా ఆమె పేరుతో ఆమె అనుమతి లేకుండా ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ.50 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తరువాత, ఆమె శాలరీ అకౌంట్ నుంచి రూ.1.99 లక్షలు కాజేశారు.
జైలుకు వెళ్తావని బెదిరించి..
తన ఆధార్ (aadhaar) వివరాలు మనీ లాండరింగ్, ఆయుధాల కొనుగోళ్ల వంటి తీవ్రమైన నేరాలతో ముడిపడి ఉన్నాయని మోసగాళ్లలో ఒకరు సీనియర్ పోలీసు అధికారి వేషంలో ఆమెకు చెప్పాడు. ఆమెను నమ్మించడం కోసం అతడు ఒక నకిలీ సీబీఐ (cbi) డాక్యుమెంట్ ను ఆమెకు మెయిల్ లో పంపించాడు.
పోలీసులకు ఫిర్యాదు
కొన్ని రోజుల తరువాత మోసపోయానని గుర్తించిన ఆ మహిళ సెప్టెంబర్ 21న సైబర్ క్రైమ్ (cybercrime) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(సి), 66(డి), భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యక్తిగత సమాచారాన్ని కోరబోమని, బెంగళూరు (BENGALURU)లో కొరియర్ మోసాలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలను వెంటనే అధికారులకు తెలియజేయాలని కొరియర్ సంస్థ ఫెడెక్స్ స్పష్టం చేసింది.