Beer price in Bengaluru: బెంగళూరు బీరు ప్రియులకు షాక్; త్వరలో భారీగా పెరగనున్న బీర్ ధర
29 August 2024, 21:59 IST
Beer price in Bengaluru: రాష్ట్రంలో మద్యం ధరల సవరణ చేపట్టాలని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదిత మద్యం ధరల సవరణ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కర్నాటక ప్రభుత్వం బీర్ ధరలను పెంచడంతో పాటు ప్రీమియం మద్యం ధరలను తగ్గించాలని భావిస్తోంది.
బెంగళూరులో భారీగా పెరగనున్న బీర్ ధర
Beer price in Bengaluru: రాజధాన నగరం బెంగళూరు సహా కర్నాటకలో బీర్ ధరలు త్వరలో పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే ఒకవైపు వివిధ కేటగిరీల బీర్ల ధరలను పెంచుతూనే, మరోవైపు, ప్రీమియం మద్యం ధరలను కొంత మేర తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు, రాష్ట్ర ప్రభుత్వం మద్యం రేట్ల సవరణను ప్రకటించబోతోందని తెలుస్తోంది.
మద్యం రేట్ల సవరణ
ఇండియన్ మేడ్ లిక్కర్ (IML) అమ్మకాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రీమియం మద్యంపై ధరను 20 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బీర్ పై మాత్రం ఒక్కో 650 ఎంఎల్ సీసా ధరను రూ. 10 నుండి రూ. 30 వరకు పెంచే అవకాశం ఉంది. బీర్ ధరల పెంపు బ్రాండ్ పై, అలాగే, అందులోని ఆల్కహాల్ కంటెంట్‌పై ఆధారపడి ఉంటుంది. కర్నాటక ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డికె శివకుమార్ వాటర్ టారిఫ్ విధించనున్నామని ఇటీవల ప్రకటించారు. నీటి ధరలు 20-30% వరకు పెరుగుతాయని ఆయన ప్రకటించారు.
ఎప్పటి నుంచంటే..?
కొత్త మద్యం రేట్లు అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. కేటగిరీల వారీగా మద్యం ధరలను సవరించాల్సి ఉంది. నిజానికి, ఆగస్టు 27 నుంచి కొత్త మద్యం ధరలను అమలు చేయాలని భావించారు. మద్యం ధరలను పెంచాలని మద్యం తయారీ కంపెనీల నుంచి చాన్నాళ్లుగా డిమాండ్ వస్తోంది. ఆ డిమాండ్‌కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, కొన్ని ప్రముఖ మద్యం (liquor) బ్రాండ్‌ల ధరను తగ్గించడం, తద్వారా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండేళ్లలో రెండింతలు పెరిగిన బీర్ల విక్రయాలు
గత రెండేళ్లలో కర్ణాటకలో బీర్ల విక్రయాలు రెండింతలు పెరిగాయి. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, బీర్ (beer) డిమాండ్ పెరగడానికి కోవిడ్ అనంతర కాలంలో వినియోగదారుల ప్రవర్తనలో మార్పు, వేసవి ఉష్ణోగ్రతల పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అన్ని బీర్ ల కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన రేటు అమలవుతోంది. అయితే, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కొత్తగా సవరించిన ధరల నమూనాను ప్రతిపాదించింది. ఇది ఆల్కహాల్ కంటెంట్ ఆధారంగా మూడు విభిన్న ధరల స్లాబ్‌లను పరిచయం చేసింది. అంతేకాకుండా, బాటిల్ బీర్, డ్రాఫ్ట్ బీర్ రెండింటికీ అదనపు ఎక్సైజ్ సుంకం (AED) పెంచే అవకాశం ఉంది. దీనివల్ల, ధర మరింత పెరుగుతుంది.