Chhattisgarh encounter : దంతెవాడలో భారీ ఎన్కౌంటర్- 9మంది మావోయిస్టులు మృతి
03 September 2024, 13:44 IST
- Chhattisgarh encounter today : ఛత్తీసగఢ్లోని దంతెవాడలో మంగళవారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎనకౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మారోమారు కాల్పుల మోత మోగింది. జిల్లా రిజర్వ్ గార్డ్- సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం- మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ ఎన్కౌంటర్లో 9మంది మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వివరించారు.
ఇప్పటి వరకు 9 మంది మావోయిస్టులను హతమార్చామని, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, 303 రైఫిల్, 315 బోర్ రైఫిల్ సహా పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
“ఆపరేషన్లో పాల్గొన్న జవాన్లంతా సురక్షితంగా ఉన్నారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తాము,” అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
8 నెలల్లో 145మంది మావోలు హతం..!
ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరివేత గత కొంతకాలంగా సాగుతోంది. కొన్ని రోజుల క్రితం, ఆగస్ట్ 29న బస్తర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు అనుమానిత మావోయిస్టులు హతమయ్యారు. నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మద్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సంయుక్త బృందం గాలింపు చర్యలు చేపట్టగా కాల్పుల్లో ముగ్గురు మరణించారు.
ఈ ఏడాది జూన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. . నారాయణపూర్-దంతెవాడ సరిహద్దు ప్రాంతంలో భద్రతా సిబ్బంది చేపట్టిన ఆపరేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇదే ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది సైతం గాయపడ్డారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 2024 జనవరి- ఆగస్ట్ మధ్యలో రాష్ట్రంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 145 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో 34 మంది పౌరులు మరణించారు.
2026 మార్చి నాటికి దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేస్తామని ఆగస్టు 24న కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్గఢ్లో వామపక్ష తీవ్రవాదంపై ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, ఛత్తీస్గఢ్- పొరుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిర్వహించిన అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. నక్సల్స్ తిరుగుబాటుకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలు, వామపక్ష తీవ్రవాదం (ఎల్డబ్ల్యూఈ) సమస్యాత్మక తొమ్మిది రాష్ట్రాల్లో రెడ్ కారిడార్లుగా పిలిచే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతి రెండింటినీ కేంద్ర హోం మంత్రి నాటి సమావేశంలో పర్యవేక్షించారు.