తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal Resignation : అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారంలోకి వస్తారా?

Arvind Kejriwal Resignation : అరవింద్ కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారంలోకి వస్తారా?

Anand Sai HT Telugu

15 September 2024, 16:03 IST

google News
    • Arvind Kejriwal Resignation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. తనకు న్యాయస్థానంలో న్యాయం జరిగిందని, అయితే ఇప్పుడు ప్రజల కోర్టులో న్యాయం జరగాలని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ఆప్ ముందస్తు ఎన్నికల వెళితే ఫలితం ఎలా ఉంటుందని చాలా మంది చర్చిస్తున్నారు. 
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్
ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ (HT_PRINT)

ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో దిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన రెండు రోజుల తర్వాత ఈ ప్రకటన చేశారు. ఆరు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన తొలి భారీ సభలో ప్రసంగిస్తూ దీల్లీ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

'రెండు రోజుల తర్వాత నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను.. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది, ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం ప్రజల ఆజ్ఞ మేరకే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను. నేను దిల్లీ ప్రజలను అడగాలనుకుంటున్నాను, కేజ్రీవాల్ నిర్దోషా లేదా దోషా? నేను పని చేసి ఉంటే నాకు ఓటు వేయండి.' అని కేజ్రీవాల్ అన్నారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీయేతర ముఖ్యమంత్రులపై కేసులు బనాయిస్తే జైలు నుండి రాజీనామా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 'బీజేపీయేతర ముఖ్యమంత్రులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. అరెస్టు చేస్తే రాజీనామాలు చేయవద్దు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలని కోరుతున్నాను.' అని దిల్లీ ముఖ్యమంత్రి అన్నారు.

రెండ్రోజుల్లో కొత్త సీఎం

ప్రజాస్వామ్యం కోసం పోరాడాలనే ఉద్దేశంతో తాను ముందుగా రాజీనామా చేయలేదన్నారు. జైలులో ఉన్నప్పుడు రాజీనామా చేయలేదని చెప్పారు. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు మరో రెండు రోజుల్లో దిల్లీలో ఆప్‌కు చెందిన 60 మంది ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దిల్లీలో ముందస్తు ఎన్నికలకు కూడా ఆప్ అధినేత పిలుపునిచ్చారు. దిల్లీలో ఎన్నికలు ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

'ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. మహారాష్ట్ర ఎన్నికలతో నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా. ఎన్నికలు జరిగే వరకు పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రి అవుతారు. ప్రజల మధ్యకు వెళ్లి మద్దతు కోరతాను. ప్రజల నుంచి తీర్పు వచ్చే వరకు ప్రతి ఇంటికి, వీధికి వెళ్తాను, సీఎం కుర్చీలో కూర్చోను.' అని కేజ్రీవాల్ చెప్పారు.

ఆప్ ప్లాన్

ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజలతో మమేకమయ్యేందుకు ఆప్ భారీ ఎత్తున ప్రచారాన్ని ప్లాన్ చేసిందని ఇది సూచిస్తుంది. కేజ్రీవాల్‌తో పాటు, మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై ఉన్న మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియా కూడా ఈ ప్రచారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తనకు అధికారంపై వ్యామోహం లేదని, ప్రజల తీర్పును కోరుకుంటున్నారని ప్రకటించినందున.. ఈ ప్రకటన AAPకి ఎన్నికల ప్రయోజనాలను చేకూర్చవచ్చు. అయితే ఈ ప్రకటనను డ్రామాగా ట్యాగ్ చేసిన బీజేపీ, దిల్లీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుస్తామని పేర్కొంది.

బీజేపీకి చెందిన హరీష్ ఖురానా మాట్లాడుతూ ఈరోజు అయినా, రేపు అయినా ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. 25 ఏళ్ల తర్వాత దిల్లీలో మళ్లీ అధికారంలోకి వస్తాం అని బదులిచ్చారు.

కేజ్రీవాల్ ఆశ్చర్యకరమైన ప్రకటనతో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. ప్రజలు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాతే తాను తిరిగి పదవిలోకి వస్తానని సిసోడియా కూడా చెప్పారు. అంటే ఇద్దరు ఆప్ అగ్రనేతలు ముఖ్యమంత్రి రేసులో లేరు. దీంతో ఎన్నికల వరకు పార్టీలోని ఇతర నేతలను ముందు వరుసలో ఉంచేందుకు ఎంచుకోవలసి ఉంటుంది. కేవలం కొన్ని నెలలకే ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం అధికార పోరుకు కూడా దారితీసే అవకాశం ఉంది.

ముందస్తుకు వెళితే వర్కౌట్ అవుతుందా?

అలాగే ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వడం కూడా ఆశ్చర్యకరమైన నిర్ణయమే. గత కొన్ని నెలలుగా, AAP చట్టపరమైన సమస్యలతో నిమగ్నమై ఉంది. అగ్రనేతలు జైలులో ఉన్నారు. ఈ మధ్య దిల్లీలో నీటి ఎద్దడి వంటి సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సమయంలో నవంబర్‌లో ఎన్నికలకు పిలుపునివ్వడం వల్ల అధికార పార్టీకి ఎన్నికలకు సన్నద్ధం కావడానికి చాలా తక్కువ సమయం ఉంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని కొందరు భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం