ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ED అరెస్ట్ చేయబోతుందంటూ ప్రచారం జోరందుకుంది. ఈ కేసులో విచారణ కోసం CM కేజ్రీవాల్‌కు ఇప్పటికే మూడుసార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఇప్పటికీ ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. మరోసారి ఈడీ సమన్లను కేజ్రీవాల్ తిరస్కరించారు. అటు రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తలమునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గాని సిద్ధంగా ఉన్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు.