H1B visa lottery : హెచ్1బీ వీసాకు అప్లై చేస్తున్నారా? 2023లో కష్టమే!
08 January 2023, 13:21 IST
H1B visa lottery 2023 : అమెరికాలో ఉంటూ.. హెచ్-1బీ కోసం ఎదురుచూస్తున్నారా? 2023లోనూ కష్టమే అని నిపుణులు అంటున్నారు. ఇందుకు పలు కారణాలను చెబుతున్నారు.
హెచ్1బీ వీసాకు అప్లే చేస్తున్నారా? 2023లో కష్టమే!
H1B visa lottery 2023 : హెచ్-1బీ వీసా విషయంలో 2023 ఏడాది.. ‘అత్యంత దారుణమైనది’గా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా లాటరీ విధానంతో చాలా మందికి నష్టం జరగొచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది.. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లు 5లక్షలు దాటిపోవచ్చని అంటున్నారు. వీటిల్లో కేవలం 85వేల వరకే ఆమోదం పొందే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఇందుకు గల కారణాలను.. యూఎస్ ఇమ్మిగ్రేషన్ లాయర్ రాబర్ట్ వెబ్బర్ వెల్లడించారు.
హెచ్-1బీ వీసా అంటే ఏంటి?
అమెరికాలో పని చేసేందుకు ఇతర దేశాల వారికి హెచ్ 1బీ వీసాలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. ఇలా వెళ్లేవారిలో చాలా మంది భారతీయులు, చైనీయులు ఉంటారు. అందుకే హెచ్-1బీపై ఏ అప్డేట్ వచ్చినా అది కీలకమే అవుతుంది.
2023లో ఎందుకు కష్టమవుతుంది?
H1B visa process : ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్:- ఈ సిస్టెమ్‌ను 2020లో లాంచ్ చేశారు. వాస్తవానికి ఇదొక గొప్ప ప్రక్రియ. మొత్తం హెచ్-1బీ ప్రాసెస్‌ను ఇది సులభతరం చేసేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేయడం చాలా కష్టమవుతోంది! కొత్త వ్యవస్థ కారణంగా అప్లికేషన్ నిబంధనలు తగ్గిపోయాయి. ఫలితంగా అప్లికేషన్లు భారీగా పెరిగాయి. పాత వ్యవస్థలో.. అప్లికేషన్ వేసేందుకు చాలా నిబంధనలు, అర్హతలు ఉండేవి.
2020లో 2,74,000గా ఉన్న హెచ్-1బీ రిజిస్ట్రేషన్ల సంఖ్య.. 2021లో 3,08,000కు పెరిగింది. ఇక 2022లో 4,83,000కి చేరింది.
జాబ్స్.. జాబ్స్..
H1B visa process 2023 : ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు.. జాబ్ కట్స్ తీసుకుంటున్న వార్తలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. అమెరికాలో జాబ్స్ డేటా శక్తివంతంగా ఉంది! యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2,23,000 ఉద్యోగాలను సృష్టించింది. అంటే.. జాబ్ సీకర్స్‌కు సగటున 1.7 ఉద్యోగాలు ఉన్నట్టు. ఫలితంగా.. ఉద్యోగం సులభంగా దొరికే అతి తక్కువ దేశాల్లో ఒకటిగా అమెరికా నిలిచింది. ఈ నేపథ్యంలో హెచ్-1బీ వీసాకు భారీగా డిమాండ్ వస్తుందని అంచనాలు ఉన్నాయి.
టెక్ సంస్థల లేఆఫ్..
బడా కంపెనీల లేఆఫ్‌ల కారణంగా అమెజాన్ వంటి కంపెనీల్లో పనిచేస్తున్న ఎఫ్-1 స్టూడెంట్‌కి కూడా లాటరీ దక్కడం కష్టమైపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉంటే.. లాటరీ రాకపోయే రిస్క్ సాధారణంగా ఉంటూనే ఉంటుంది. అయితే.. లాటరీలో ఎంపికైనా.. ప్రాసెస్‌లో ఎలిమినేట్ చేసే ప్రమాదం ఈసారి ఎక్కువగానే ఉండొచ్చు.
గతేడాది లాటరీలో రాని వారు..
H1B Visa lottery waiting status : 2022 మార్చ్‌లో రికార్డు స్థాయిలో లాటరీ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. వారిలో చాలా మందికి హెచ్-1బీ వీసా రాలేదు. వారందరు.. ఈసారి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.