Google layoffs: 10వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో గూగుల్.. ఆ ప్రాసెస్ పూర్తయిన వెంటనే..!
Google layoffs: 10వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రముఖ కంపెనీ గూగుల్ సిద్ధమైంది. ఎవరిని తొలగించాలో నిర్ణయించేందుకు ఓ కొత్త మేనేజ్‍మెంట్ సిస్టమ్‍ను కూడా తీసుకొచ్చిందని సమాచారం. పూర్తి వివరాలు ఇవే.
Google layoffs: దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఏకంగా 10వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ (Alphabet) నిర్ణయించుకున్నట్టు రిపోర్టులు వెల్లడయ్యాయి. ఇప్పటికే పాపులర్ సంస్థలు ట్విట్టర్, మెటా, అమెజాన్ భారీ స్థాయిలో సిబ్బందిని తొలగించగా.. ఇప్పుడు గూగుల్ కూడా ఇదే బాట పట్టేందుకు సిద్ధమైంది. ఉద్యోగుల తొలగింపు కోసం ఓ సిస్టమ్‍ను కూడా కొత్తగా తీసుకొస్తోంది ఆ సంస్థ. దీని ద్వారా పర్ఫార్మెన్స్ తక్కువగా ఉన్న ఉద్యోగులను గుర్తించి వేటు వేయనుంది.
Google layoff: ఎంపిక చేసేందుకు కొత్త సిస్టమ్
కొత్త ర్యాంకింగ్, పర్ఫార్మెన్స్ సిస్టమ్ ద్వారా ఉద్యోగుల పనితీరును గూగుల్ లెక్కించనుందని సమాచారం. ఈ కొత్త మేనేజ్‍మెంట్ సిస్టమ్ ద్వారా తక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్న ఉద్యోగులను మేనేజర్లు సులువుగా గుర్తించగలరని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. సరైన పర్ఫార్మెన్స్ కనబరచని ఉద్యోగులను గూగుల్ తొలగిస్తుందని రిపోర్టులు వెల్లడించాయి. 2023 ప్రారంభంలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని తెలుస్తోంది. సరైన పనితీరు కనబరచని 6శాతం మంది ఎంప్లాయిస్‍ను గుర్తించాలని మేనేజర్లకు గూగుల్ చెప్పిందట.
Google layoff: బోనస్‍ల కట్ కూడా..
కొత్త పర్ఫార్మెన్స్ మేనేజ్‍మెంట్ సిస్టమ్ ద్వారా గూగుల్ ఉద్యోగుల బోనస్‍లకు కూడా గండం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సిస్టమ్ సాయంతో మేనేజర్లు ఇచ్చే రేటింగ్‍ను బట్టి బోనస్ ఉంటుంది. మేనేజర్స్ అవసరమైతే ఎంప్లాయిస్‍కు బోనస్‍ను మొత్తంగా కట్ చేయవచ్చు. స్టాక్స్ కేటాయింపునకు కూడా ఇది వర్తిస్తుందని సమాచారం.
Google layoff: రెండు నెలల ముందే సంకేతాలు!
ఉద్యోగుల తొలగింపు గురించి గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ ఇంకా అధికారంగా చెప్పలేదు. అయితే ఈ విషయంపై రెండు నెలల క్రితమే అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సంకేతాలు ఇచ్చారు. కంపెనీలో ఉద్యోగుల సంఖ్యకు తగ్గట్టు ప్రొడక్టివిటీ లేదని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఎక్కువ మంది ఉద్యోగులు సమర్థంగా పని చేయడం లేదన్నట్టు మాట్లాడారు. ఇప్పటి నుంచే గూగుల్‍లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందనే అంచనాలు మొదలయ్యాయి.
Google layoffs: కారణాలు ఇవే
గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ లాభాలు, ఆదాయం ఈ ఏడాది అంచనాలకు తగట్టుగా లేదు. 2022 రెండో క్వార్టర్ లో అంచనాలను ఆ సంస్థ అందుకోలేకపోయింది. ఆదాయ వృద్ధిలో ఏకంగా 13శాతం క్షీణత నమోదైంది. ఆర్థిక మాంద్యం భయాలు కూడా కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో ఉద్యోగుల తొలగింపునకు గూగుల్ కూడా మొగ్గుచూపుతన్నట్టు తెలుస్తోంది.