Gujarat elections : సామాజిక మాధ్యమాల్లో 'ఎలక్షన్ వార్'.. ఓట్ల కోసం పార్టీల తిప్పలు!
18 November 2022, 12:00 IST
Gujarat assembly elections 2022 : గుజరాత్లో ఎన్నికల హడావుడి తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ముఖ్యంగా.. సోషల్ మీడియాలో అన్ని పార్టీలు విపరీతంగా ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు రంగోలీ వేసిన విద్యార్థినులు
Gujarat assembly elections : ఈ సోషల్ మీడియా యుగంలో ఎన్నికల ప్రచారాల శైలి పూర్తిగా మారిపోయింది. ఈ విషయం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో మరోమారు రుజువైంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు రాజకీయ పార్టీలు. ఓవైపు ఇంటింటి ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు తమ సోషల్ మీడియా 'ఆర్మీ'తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
'మాకు ఓటేయండి' అంటూ అధికార బీజేపీ.. ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల మీద పోస్టులు పెడుతుంటే.. విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు.. వాట్సాప్ వంటి యాప్స్‌తో ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నాయి.
ప్రచారాల జోరు..
Gujarat BJP social media campaign : బీజేపీ ఐటీ సెల్.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఎన్నికల సమయంలో ఐటీ సెల్ హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చురుకుగా ఉంటోంది బీజేపీ ఐటీ సెల్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో బీజేపీ సాధించిన ప్రగతిని చెప్పుకుంటూ పోస్ట్‌లు సృష్టిస్తోంది. ఈ పోస్టులను వీలైనంతగా షేర్ చేస్తూ.. ప్రజల్లోకి వెళుతోంది. ముఖ్యంగా.. 2001-14 మధ్య కాలంలో గుజరాత్ సీఎంగా మోదీ చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తోంది. అంతేకాకుండా.. 'ఆ గుజరాత్ మే బనావ్యు ఛే(నేను ఈ గుజరాత్‌ను తీర్చిదిద్దాను),' అని క్యాంపైన్‌ను ప్రారంభించి.. సున్నితమైన అంశాలను కూడా ప్రస్తావిస్తోంది.
"ఇప్పటివరకు సోషల్ మీడియాలో 5 క్యాంపైన్లను చేశాము. రానున్న రోజుల్లో మరిన్ని తీసుకొస్తాము. ప్రజలకు నిత్యం కొత్తదనాన్ని అందించే విధంగా మా క్యాంపైన్‌ను మార్చుకుంటూ ఉంటాము," అని ఆప్ ప్రతినిధి మానన్ దాని అన్నారు.
Gujarat congress WhatsApp groups : ఇక ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోంది. 27ఏళ్లల్లో బీజేపీ చేసిందేమీ లేదని.. కాంగ్రెస్‌తో గుజరాత్ అభివృద్ధి సాధ్యపడుతుందని పోస్టులు సృష్టించి ప్రచారాలు చేస్తోంది. 27ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాలనను ప్రజలకు గుర్తుచేసే విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం భారీ ప్రణాళికనే రచించింది. అసెంబ్లీ సీటుకో ప్రత్యేక ఎఫ్బీ పేజీ, లేదా సామాజిక సంఘానికి సంబంధించిన ప్రత్యేక పేజీని రూపొందించి అందులో పోస్టులు చేస్తోంది. బూత్, గ్రామ స్థాయిలో 50వేలకు పైగా వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో విధంగా ప్రచారాలు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం పలు కంటెంట్ ఏజెన్సీలను నియమించుకుంది.
ఇక ఆప్ విషయానికొస్తే.. అరవింద్ కేజ్రీవాల్ 'హామీల' వర్షంపై సోషల్ మీడియాలో ఎక్కువ దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఓటర్లతో కనెక్ట్ అయ్యేందుకు వాట్సాప్‌ను ఉపయోగించుకుంటోంది. కేజ్రీవాల్ సోషల్ మీడియా క్యాంపైన్‌ను చూసుకునేందుకు 25మంది యువకులతో కూడిన ఓ బృందం ఉంది. వీరితో పాటు ఆప్‌నకు 20వేలకుపైగా 'సోషల్ మీడియా వారియర్లు' ఉన్నారు. వేలాది వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసినట్టు ఆప్ సభ్యులు చెబుతున్నారు.
నెట్టింట ఎలక్షన్ వార్..
బీజేపీకి ఫేస్బుక్లో 35లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 57.8లక్షల మంది, ట్విట్టర్లో 1.5మిలియన్ లక్షల మంది, యూట్యూబ్‌లో 45,600 మంది ఫాలోవర్లు ఉన్నారు. కమలదళం సోషల్ మీడియా ప్రచారాల కోసం.. 20,000మంది వర్కర్లు, మరో 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.
Gujarat assembly elections date : కాంగ్రెస్‌కు.. ఫేస్బుక్లో 7లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 64.3లక్షల మంది, ట్విట్టర్లో 1.64లక్షల మంది, యూట్యూబ్‌లో 8.91లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆప్‌నకు ఫేస్బుక్లో 5.67లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.17లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆప్‌నకు ప్రత్యేకించి యూట్యూబ్ ఛానెల్ లేదు. పార్టీ జాతీయ యూట్యూబ్ ఛానెల్‌కు 42.3లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఓటర్లు.. ఎవరి పక్షం..?
Gujarat assembly elections results : 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్‌కు డిసెంబర్ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరి ఏ పార్టీ సోషల్ మీడియా క్యాంపైన్ ఫలిస్తుందో తెలుసుకోవాలంటే.. ఫలితాలు వెలువడే డిసెంబర్ 8 వరకు వేచి చూడాల్సిందే.