Gujarat assembly elections : ‘ట్రైన్ లేకపోతే.. ఓటు లేదు’- 18 గ్రామాల ప్రజలు నిరసన!
Gujarat assembly elections boycott : గుజరాత్లో 18 గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. తమ ప్రాంతంలో ఆగాల్సిన రైలు ఆగడం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని ప్రజలు అంటున్నారు. అందుకే ఎన్నికలను, ఎన్నికల ప్రచారాలను బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పారు.
Gujarat assembly elections Navsari : గుజరాత్లో ఎన్నికల హడావుడి తీవ్రస్థాయిలో ఉంది. ఎన్నికల ప్రచారాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు మారుమోగిపోతున్నాయి. గెలుపు మాదంటే.. మాదే అని పార్టీలన్నీ ధీమాగా చెబుతున్నాయి. వీటన్నిటి మధ్య.. నవసారి నుంచి ఓ వార్త బయటకొచ్చింది. అక్కడి 18 గ్రామాల్లోని ప్రజలు ఎన్నికలను బహిష్కరించేందుకు సిద్ధపడ్డారు. అంతేకాకుండా ప్రచారాలకు కూడా ఎవరూ రావొద్దని అల్టిమేటం ఇచ్చారు. కారణం ఏంటంటే..
ఎన్నికల బహిష్కరణ.. ఎందుకు?
నవసారి నియోజకవర్గంలో అంచెలి అనే గ్రామం ఉంది. అంచెలి రైల్వేస్టేషన్లో 1966 నుంచి ఒకటే ప్యాసింజర్ రైలు ఆగుతోంది. చుట్టుపక్కన 18 గ్రామాల ప్రజలు.. ఉద్యోగాలు, చదువుల కోసం ఈ ప్యాసింజర్ రైలు ఎక్కి వేరే ప్రాంతాలకు వెళ్లేవారు.
కొవిడ్ సంక్షోభంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. కొవిడ్ కారణంగా రైల్వే సేవలను నిలిపివేసింది ప్రభుత్వం. ఆ తర్వాత దశలవారీగా పునరుద్ధరించింది. అంచెలిలో ఆగాల్సిన ప్యాసింజర్ రైలు కూడా పట్టాలెక్కింది. కానీ ఈసారి.. ఆ రైలు అంచెలి రైల్వే స్టేషన్లో ఆగడం మానేసింది! ప్రజలు ఒకసారి చూశారు, రెండుసార్లు చూశారు.. కానీ రైలు మాత్రం ఆగలేదు. అసలే కొవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న వారు.. ఈ సమస్యతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలు తమను దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Gujarat assembly elections Ancheli : 18గ్రామాల ప్రజలు ఈ విషయంపై అధికారులను సంప్రదించారు. రైలును అంచెలి రైల్వేస్టేషన్లో ఆపాలని విజ్ఞప్తి చేశారు. కానీ పరిస్థితులు మారలేదు.
ఈ పరిణామాల మధ్య అంచెలితో పాటు 17 గ్రామాల ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే.. ఈ దఫా గుజరాత్ ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. అంతేకాకుండా.. రాజకీయ నేతలు ప్రచారాలకు వస్తే తీవ్ర పరిస్థితులు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికార పక్షాన్ని కూడా గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వమని తేల్చేశారు.
ఈ క్రమంలోనే రైల్వే స్టేషన్ వద్ద బ్యానర్లు వెలిశాయి. 'రైలు లేకపోతే ఓటు లేదు. బీజేపీ లేదా ఇతర పార్టీలేవీ ప్రచారాల కోసం ఇక్కడికి రాకూడదు. మా డిమాండ్లను నెరవర్చలేదు. అందుకే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాము,' అని ఆ బ్యానర్లలో రాసి ఉంది.
Ancheli railway station : "మాకు చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రైలు కేటాయించాలని మేము అడగడం లేదు. ఉన్న రైలును స్టేషన్లో ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నా.. స్థానిక యంత్రాంగం పట్టించుకోవడం లేదు. అందుకే మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. వాళ్లు ఈవీఎంలను పంపిస్తే.. ఓట్లు వేయకుండా తిరిగి ఇచ్చేస్తాము," అని గ్రామస్థుడు తెలిపాడు.
182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1,5వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.
సంబంధిత కథనం